రిలయన్స్‌ షేరుపై బ్రోకరేజ్‌లకు ఎందుకంత మోజు..?

18 Jun, 2020 11:46 IST|Sakshi

3నెలల్లో 80శాతం పెరిగినా ‘‘బై’’ రేటింగ్‌ కేటాయింపే

దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఈ ఏడాది మార్చి కనిష్టస్థాయి నుంచి షేరు ఏకంగా 80శాతం పెరిగింది. కేవలం 3నెలల్లోనే 10 విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు రిలయన్స్‌ జియోలో దాదాపు రూ.1.04లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో మంగళవారం ఇంట్రాడే షేరు రూ.1647 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ షేరు ఇంత స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., రానున్న రోజుల్లో మరింత లాభపడేందుకు అవకాశాలున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలైన మోర్గాన్‌ స్టాన్లీ, గోల్డ్‌మెన్‌ శాక్స్‌, సీఎల్‌ఎస్‌ఏలు రిలయన్స్‌ షేరుపై ఇప్పటికీ బుల్లిష్‌ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుపై ఆయా సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి...   


మోర్గాన్‌ స్టాన్లీ: ఆస్తుల అమ్మకాలు, ఇంధన విభాగంలో క్యాష్‌ ఫ్లోలు తిరిగి పుంజుకోవడం, రిటైల్‌ అమ్మకాలు పెరగడం, టెలికాం యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ పెరగడం తదితర కారణాలతో షేరు రానున్న రోజుల్లో మరింత ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. ‘‘ ఏడాది తర్వాత ప్రైస్-టు-ఎర్నింగ్‌ (పీ/ఈ), ప్రైస్-టు-బుక్ (పీ/బీ)లు ఇప్పుడు సైకిల్‌ లెవల్‌లో గరిష్టస్థాయి వద్ద ఉన్నాయి. అయితే ఈక్విటీపై రిటర్న్‌(ఆర్‌ఓఈ), వృద్ధి ఆదాయాలను తన సహచర కంపెనీలు(పీర్స్‌)తో పోలిస్తే అధికంగా ఉన్నాయి.’’ అని మోర్గాన్‌ స్టాన్లీ ఈక్విటి విశ్లేషకుడు మయాంక్‌ మహేశ్వర్‌ తెలిపారు. 

మోర్గాన్‌ స్లాన్టీ ఈ షేరుపై ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.1801కి పెంచింది.

గోల్డ్‌మెన్‌ శాక్స్‌: బ్రోకరేజ్‌ అంచనాల ప్రకారం.... ఆఫ్‌లైన్ గ్రాసరీ స్టోర్ విస్తరణ-ఆధారిత మార్కెట్ వాటా, ఆన్‌లైన్ గ్రాసరీ మార్కెట్‌ విస్తరణతో  రిలయన్స్‌ గ్రాసరీ రీటైల్‌ స్థూల వ్యాపారణ విలువ ఆర్థిక సంవత్సరం 2029 నాటికి 83బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. అంతేకాకుండా, రిటైల్ వ్యాపారం ఎబిడిటా ఎఫ్‌వై 20-29 మధ్య 5.6 రెట్ల వృద్ధిని సాధిస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ  ఆశిస్తోంది. 

గోల్డ్‌మెన్‌ శాక్స్‌ ''బై'' రేటింగ్‌ కేటాయించడంతో పాటు పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.1755గా నిర్ణయించింది 

సీఎల్‌ఎస్ఏ: ఈ-కామర్స్‌ రంగంలో విజయవంతం కావడం, ఇన్విట్‌ టవర్ల వాటా అమ్మకం, జియో ఫ్లాట్‌ఫామ్‌లో మరింత వాటా విక్రయం, అరామ్‌కో ఒప్పందం తదితదర అంశాలు రిలయన్స్‌ షేరు తదుపరి ర్యాలీని నడిపిస్తాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఇటీవల ఫేస్‌బుక్‌తో ఒప్పందం జియో మార్ట్‌కు కలిసొస్తుంది. ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థ వాట్సప్‌ ద్వారా వినియోగదారులతో సత్సంబంధం పెంచుకోవడం, నిరంతరం వారికి అందుబాటులో ఉండటంతో వ్యాపార అభివృద్ధికి మరింత కలిసొస్తుందని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.

సీఎల్‌ఎస్‌ఈ బ్రోకరేజ్‌ సంస్థ సైతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుపై బుల్లిష్‌ వైఖరిని కలిగి ఉంది.

మరిన్ని వార్తలు