బిల్లులతో చిల్లు!

21 May, 2018 02:10 IST|Sakshi

 విద్యుత్‌ శాఖలో ఇంటి దొంగల చేతివాటం 

అక్రమంగా 26 కోట్ల బిల్లుల రద్దు 

‘సంగారెడ్డి’ అధికారుల నిర్వాకం 

నలుగురు అధికారులపై సస్పెన్షన్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)కు ఇంటి దొంగలే కన్నం వేస్తున్నారు. భారీ పరిశ్రమల యజమానులతో కుమ్మక్కై కోట్లాది రూపాయల బిల్లును అక్రమంగా రద్దు చేసి సంస్థకు శఠగోపం పెడుతున్నారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సంగారెడ్డి సర్కిల్‌ కార్యాలయం పరిధిలో తాజాగా వెలుగు చూసిన ఓ కుంభకోణం విద్యుత్‌ శాఖలో సంచలనం సృష్టిస్తోంది. సదాశివపేట మండలం బుదేర గ్రామంలో హైటెన్షన్‌ విద్యుత్‌ కనెక్షన్లు కలిగిన రెండు పరిశ్రమల యజమానితో సంగారెడ్డి సర్కిల్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది కుమ్మక్కై గత పదేళ్లలో ఏకంగా రూ.26 కోట్ల బిల్లులను రద్దు చేసినట్లు సంస్థ యాజమాన్యం జరిపిన విచారణలో బహిర్గతమైంది. ఈ స్కాంతో సంబంధం ఉన్న నలుగురు అధికారులను సస్పెండ్‌ చేస్తూ టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వారిలో సంస్థ కార్పొరేట్‌ కార్యాలయం జనరల్‌ మేనేజర్‌ మంజుల, సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం అకౌంట్స్‌ ఆఫీసర్‌ సత్తయ్య, సంగారెడ్డి సర్కిల్‌ కార్యాలయం అకౌంట్స్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్, మరో సీనియర్‌ అసిస్టెంట్‌ ఉన్నారు. పదోన్నతిపై కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ కాకముందు సంగారెడ్డి సర్కిల్‌ కార్యాలయంలో సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పని చేసిన మంజుల ఈ అక్రమాలకు సహకరించారని విచారణలో తేలింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విభాగాల్లో ఓ ఉద్యోగిని మూడేళ్లకు మించి ఒకేస్థానంలో కొనసాగించరాదని స్పష్టమైన నిబంధనలున్నా, 10 ఏళ్లుగా సంగారెడ్డి సర్కిల్‌ కార్యాలయంలో తిష్టవేసిన అకౌంట్స్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సత్తయ్య గతేడాది రెండు నెలలపాటు మాత్రమే సంగారెడ్డిలో పని చేయగా, ఓ సంతకం చేశారని ఆరోపణలపై ఆయనను కూడా సస్పెండ్‌ చేయడం గమనార్హం.
 
జర్నల్‌ ఎంట్రీతో దోచేశారు.. 
అన్ని వ్యాపార సంస్థల తరహాలోనే రాష్ట్ర విద్యుత్‌ సంస్థలూ డబుల్‌ ఎంట్రీ విధానంలో ఆర్థిక పద్దులు నిర్వహిస్తున్నాయి. వినియోగదారుల నుంచి రావాల్సిన బిల్లుల మొత్తాన్ని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పద్దుల్లో డెబిట్‌గా చూపిస్తారు. ఒకసారి ఎంట్రీ చేసిన బిల్లు మొత్తాన్ని తప్పనిసరిగా వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిందే. అయితే ఏదైనా సాంకేతిక కారణాలతో విద్యుత్‌ బిల్లుల జారీలో పొరపాట్లు దొర్లినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేస్తే సమగ్ర దర్యాప్తు జరిపి నిర్ధారించుకున్న తర్వాత జర్నల్‌ ఎంట్రీ (జేఈ) పేరుతో పద్దులను దిద్దుబాటు చేసి బిల్లులను తగ్గించే అధికారం సంస్థ అకౌంట్స్‌ విభాగం అధికారులకు ఉంటుంది. సాధారణంగా మీటర్లు జంప్‌ అయ్యాయని, తప్పుడు బిల్లింగ్‌ నమోదు చేశారని, చాలా కాలంగా డోర్‌ లాక్‌ ఉన్నా అడ్డగోలుగా బిల్లులు వేశారని వినియోగదారులు ఫిర్యాదు చేస్తుంటారు. సంస్థ నిబంధనల ప్రకారం జర్నల్‌ ఎంట్రీ విధానంలో బిల్లులను సరిదిద్దడానికి ముందు కనీసం జూనియర్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి సాంకేతికంగా బిల్లింగ్‌లో తప్పులు జరిగినట్లు నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక వచ్చిన తర్వాతే జర్నల్‌ ఎంట్రీ విధానంలో తప్పును సరిదిద్దుకోవాలి.

అయితే సంగారెడ్డి సర్కిల్‌ కార్యాలయంలోని కొందరు అధికారులు ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయడం ద్వారా 2008 నుంచి ఇప్పటి వరకు ఒకే యజమానికి చెందిన రెండు పరిశ్రమల విద్యుత్‌ బిల్లులను పదుల సార్లు తగ్గించినట్లు విచారణలో తేలింది. సదరు పరిశ్రమల యజమాని కోర్టుకు వెళ్లాడనే కారణం చూపి డబుల్‌ ఎంట్రీ విధానంలో పలుమార్లు రూ.కోట్ల బిల్లులు రద్దు చేశారని బయటపడింది. బిల్లుల బకాయిలను కూడా సెటిల్మెంట్‌ పేరుతో పలుమార్లు తగ్గించారని, ఆ తర్వాత మళ్లీ కొత్త విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేస్తూ పోయినట్లు సమాచారం. 10 ఏళ్లలో ఆ యజమానికి సంబంధించిన విద్యుత్‌ బిల్లులను పలుమార్లు తగ్గించడం ద్వారా సంస్థకు రూ.26 కోట్ల నష్టాన్ని కలిగించినట్లు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై సంగారెడ్డి సర్కిల్‌ కార్యాలయ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ రవికుమార్‌ వివరణ కోసం ‘సాక్షి’ ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.  

 

మరిన్ని వార్తలు