పంటలు ఆగమాగం

9 Aug, 2017 02:15 IST|Sakshi
పంటలు ఆగమాగం

► గులాబీ రంగు పురుగు దాడితో పత్తి విలవిల
► వర్షాల్లేక ఎండిపోతున్న వరి, సోయా, మొక్కజొన్న
► వారం పది రోజుల్లో వర్షాలు పడకుంటే పంట చేతికి రావడం కష్టమే
► క్రిడా, వ్యవసాయ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పత్తి పంటపై గులాబీ రంగు పురుగు దాడి చేస్తోందని, దీంతో తెల్లదోమ సోకే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తగు నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌), కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడా), రాష్ట్ర వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో 30 జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వివరాలను క్రిడా, వ్యవసాయ శాఖలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. పత్తిని గులాబీ రంగు పురుగు పట్టి పీడిస్తోందని సమావేశంలో వివిధ జిల్లాల వ్యవసాయాధికారులు తెలిపారు. ఇది మిగతా ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందన్నారు. వర్షాభావం వల్ల తెల్లదోమ కూడా ఆశించవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. రానున్న వారం రోజుల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నందున రైతులకు తగు సూచనలు ఇవ్వాల్సిందిగా శాస్త్రవేత్తలు అధికారులకు సూచించారు. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పరిస్థితిపై అధికారులు నివేదిక సమర్పించారు.

ముందస్తు రబీకి వెళ్లడమే మంచిది!
రాష్ట్రంలో పంటలు ఆగమాగంగానే ఉన్నాయని జిల్లా అధికారులు ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని తమ నివేదికలో పేర్కొన్నారు. పత్తి, సోయా, మొక్కజొన్న, వరి ఎండిపోతున్నాయని వివరించారు. వారం పది రోజుల్లో సరైన వర్షాలు పడకుంటే అవేవీ చేతికి రావని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొంత ప్రయోజనం కలిగించినా.. అవేవీ సరిపోవని చెప్పినట్లు సమాచారం. గులాబీ రంగు పురుగు, తెల్ల దోమలతో పత్తి అతలాకుతలం అవుతున్నట్లు పేర్కొన్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ గట్టెక్కకుంటే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని శాస్త్రవేత్తలు సూచించినట్లు తెలిసింది. ఆ మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తయారుచేసి వ్యవసాయశాఖకు అందజేశారు. ఈ నెలాఖరు వరకు సరైన వర్షాలు రాకుంటే ఖరీఫ్‌ పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది పంటలు వేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. నెలాఖరు వరకు కూడా పత్తి పరిస్థితి మెరుగుకాకుంటే ముందస్తు రబీకి వెళ్లడమే మంచిదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఖరీఫ్‌ పంటలు ఎండిపోతే ముందస్తుగా సెప్టెంబర్‌ రెండో వారం నుంచే రబీ పంటలు సాగు చేయాలని సూచించారు. ఖరీఫ్‌ వరినాట్లు ఇంకా 44 శాతానికి మించలేదని, ఈ నెలాఖరు వరకు వేసే పరిస్థితి కూడా లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అందువల్ల ముందస్తు రబీకి వెళ్లడమే మంచిదని సూచించినట్లు తెలిసింది. కాగా కీలక సమావేశం సుదీర్ఘంగా జరిగినా అందులో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేదని సమాచారం. రైతులకు సమాచారం ఇవ్వాల్సిందిపోయి అత్యంత గోప్యంగా సమావేశాన్ని నిర్వహించి ముగించినట్లు విమర్శలు వచ్చాయి.

మరిన్ని వార్తలు