పసుపు బోర్డు ఏర్పాటు చేయకుంటే రాజీనామా

8 Apr, 2019 14:46 IST|Sakshi
ముప్కాల్‌లో మాట్లాడుతున్న అర్వింద్‌

బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌

బాల్కొండ/కమ్మర్‌పల్లి/మోర్తాడ్‌: పసుపు పంటకు మద్దతు ధర కోసం  పసుపు బోర్డు ఏర్పాటు చేయకుంటే పది రోజుల్లో రాజీనామా చేసి రైతులతో కలిసి పోరాటం చేస్తానని బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ముప్కాల్, బాల్కొండ మండల కేంద్రాలు, కమ్మర్‌పల్లి మండలం ఉఫ్లూర్, ఏర్గట్లలో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌కు ఎన్నికైన 10 రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానన్నారు.

లేదంటే పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానన్నారు. ఇళ్లులేని ప్రతి పేదవాళ్లకు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం నిధులిస్తే టీఆర్‌ఎస్‌ నాయకులు కమీషన్‌ కోసం మిషన్‌ భగీరథ పనుల్లో ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో మహిళలకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు దేశం కోసం ఆలోచించి ఓటు వేయాలన్నారు.

ప్రాంతీయ పార్టీలు దేశ సమైక్యతను కాపాడలేవన్నారు. దేశాన్ని కాపాడే సత్తా మోదీకే ఉందన్నారు. టీఆర్‌ఎస్‌తో రైతులకు ఒరింగిదేమి లేదన్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. నిజాంషుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించాలని తాను గతంలో ముత్యంపేట్‌ నుంచి బోధన్‌ వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో రుయ్యాడీ రాజేశ్వర్, తేలు నరేశ్, లింగారెడ్డి, నల్లమోహన్, ఢమాంకర్‌ శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, శివరాజ్, శ్రీనివాస్, రమేష్, శ్రావణ్‌కుమార్, మనోహర్, రాజారెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు