కేసులు మరింత పెరిగితే..

2 Jun, 2020 05:39 IST|Sakshi

ఇళ్లలోనే చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం

రోగ నిరోధకత పెంచుకునేందుకు టెలీ మెడిసిన్‌ ద్వారా నిపుణుల సలహాలు

కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగంలో ఆందోళన

ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ

గాంధీ, ఛాతీ, ఫీవర్‌ ఆసుపత్రులతో పాటు ‘టిమ్స్‌’లో చికిత్సకు ఏర్పాట్లు

చికిత్స పొందుతూ లక్షణాల్లేని వారిని వెంటనే డిశ్చార్జి చేయాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 199 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజానీ కం ఉలిక్కిపడింది. లాక్‌డౌన్‌ సడలింపులతో కేసుల సంఖ్య పెరుగుతోందని, మున్ముందు ఇంకా పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న అంశం పై వైద్య ఆరోగ్య శాఖ యం త్రాంగం అప్రమత్తమైంది.

రాబోయే సవాళ్లను ఎదుర్కోవడం, చికిత్స, నియంత్ర ణ చర్యలపై తాజాగా ప్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చే సింది. ఇంకా కరోనా కేసులు పెరిగితే ఆసుపత్రుల్లో ఉంచే అవకాశం తక్కువ. పైగా ఈ నెల నుంచి సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ ఫీవర్లు, డెంగీ వంటి జ్వరాలు కూడా మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసి పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసుల విషయంలో ప్రణాళిక రచించింది.

త్వరలో అందుబాటులోకి ‘టిమ్స్‌’
ప్రధానంగా గాంధీ ఆసుపత్రిలోనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అడపాదడపా ఛాతీ, ఫీవర్‌ ఆ సుపత్రిలోనూ చికిత్స అందజేస్తున్నారు. ఇక పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా గచ్చిబౌలిలోని టిమ్స్‌ను సిద్ధం చేశారు. అయితే అక్కడ ప్రస్తుతం ఇంకా చికిత్సలు మొదలుకాలేదు. కేసుల సంఖ్య పెరిగితే టిమ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇలా అవకాశం ఉన్నంతవరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకుంటారు. జిల్లా స్థాయిలోనూ కరోనా వార్డులను సిద్ధం చేస్తారు. మరోవైపు ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులకు కూడా చికిత్సకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉండే వాటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. అయితే కరోనా రోగులను అన్ని ఆసుపత్రుల్లో ఉంచితే సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

లక్షణాలు లేకుంటే డిశ్చార్జి..
ప్రస్తుతం చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో చాలామంది లక్షణాలు లేని వారే ఉంటున్నారు. కొందరికి మాత్రమే తీవ్రమైన లక్షణాలుంటుండగా, మరికొందరు వెంటిలేటర్లపై ఉం టున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న వారిలో గత మూడు రోజులుగా ఎలాంటి జ్వరం, దగ్గు వంటి లక్షణాలు లేని వారిని పరీక్షలు చేయకుండానే డిశ్చార్జి చేస్తారు. ఈ మేర కు ఇప్పటికే అలాంటి వారి జాబితా తయారు చేశారు. ఇటీవల కొందరిని అలాగే పంపినట్లు చెబుతున్నాయి. ఇది కూడా కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే చేస్తున్నామని పేర్కొంటున్నాయి. ఇంటికెళ్లాక నిర్ణీత సమయం ప్రకారం వారు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 

ఇంట్లోనే చికిత్స
కరోనా రోగులకు చి కిత్స చేసే విషయంలో కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నా రు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయి, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారు తమ ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాంటి వారు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యులు సూచించిన మందులు వాడితే సరిపోతుంది. అయితే ఇరుకైన ఇళ్లున్న వారికి ఈ వెసులుబాటు వర్తించదు. మిగతా కుటుంబ సభ్యులతో కలవకుండా ప్రత్యేక గదిలో ఉండటానికి వీలున్న వారికే ఇది వర్తిస్తుంది.

ఒకవేళ వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రుల్లోనే ఉంటా మని చెబితే.. వారికి అలాగే చికిత్స అందజేస్తారు. అంతేకాదు కరోనా పాజిటివ్‌ లక్షణాలుండి, తీవ్రత తక్కువ ఉన్న రోగి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకోవాలంటే, సంబంధిత వైద్యుడి అనుమతి ఉండాలి. అలా ఉంచడం వల్ల వైద్యపరంగా ఎలాం టి ఇబ్బందులు ఉండవని వైద్యుడు నిర్ధారించాలి.

ఇంట్లో రోగి సంరక్షణ బాధ్యతలు తీసుకునే వారు తప్పనిసరిగా ప్రొటోకాల్‌ ప్రకారం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందులు, రోగనిరోధక శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. రోగి మొబైల్‌లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ ఉండాలి. అది ఎల్లప్పుడూ యాక్టివ్‌ లో ఉండాలి. వైద్య బృందాలు ఆ వ్యక్తి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తక్షణమే ఆసుపత్రికి తరలిస్తారు. రోగి ఇంట్లో ఉన్నప్పుడు ట్రిపుల్‌ లేయర్‌ మెడికల్‌ మాస్క్‌ వాడాలి. రోగికి ఏమైనా ఆరోగ్యపరమైన సమస్య వస్తే డాక్టర్లు టెలీ లేదా వీడియో కాల్‌ ద్వారా సలహాలు ఇస్తారు. రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారాన్ని సూచిస్తారు. 

మరిన్ని వార్తలు