‘తొలి’ కేసు

20 May, 2020 06:52 IST|Sakshi

లాక్‌డౌన్‌ విధించాక మొదటిసారిగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు

పుత్లిబౌలి చౌరస్తాలో చిక్కిన ఆటోడ్రైవర్‌

మాస్కులు ధరించని వారిపైనా చర్యలు

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచి  మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నిర్వహించే డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు రాజధానిలోని మూడు కమిషనరేట్ల అధికారులు గణనీయంగా తగ్గించేశారు. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిలిపివేశారు. దాదాపు పది రోజులుగా మద్యం విక్రయాలు మొదలైనా..ఈ పరీక్షలు ప్రారంభంకాలేదు. సుదీర్ఘ విరామం తర్వాత మంగళవారం తొలి కేసు నమోదైంది. భారీ స్థాయిలో సడలింపులు అమలులోకి రావడంతో అనుమానిత డ్రైవర్లకు, ప్రమాదాలకు కారణమైన, గురైన వారికి డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ట్రాఫిక్‌ విభాగం అధికారులు మంగళవారం నుంచి నిఘా ముమ్మరం చేశారు. మధ్యాహ్నం కోఠి వైపు నుంచి వస్తున్న ఖాళీ గూడ్స్‌ ఆటో పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆటోడ్రైవర్‌కు డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. (బస్సెక్కేందుకు భయపడ్డరు)

దీంతో సమీపంలోని సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ వద్ద ఉన్న బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్ష చేయగా..అతడు మద్యం తాగినట్లు తేలింది. 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిల్లీ లీటర్ల ఆల్కహాల్‌ ఉంటే అది ఉల్లంఘన కిందికి వస్తుంది. దీన్ని సాంకేతికంగా బీఏసీ కౌంట్‌ అంటారు. పుత్లిబౌలి చౌరస్తాలో చిక్కిన ఆటోడ్రైవర్‌కు ఈ కౌంట్‌ 187 వచ్చింది. దీంతో ఆటోను స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. మరోపక్క మాస్కులు లేకుండా రహదారులపైకి వస్తున్న వారిపైనా పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. మంగళవారం రాజధానిలోని మూడు కమిషనరేట్లలో కలిపి 395 మాస్క్‌ వైలేషన్‌ కేసులు నమోదయ్యాయి. మాస్క్‌  ధరించకుండా బయటకు వచ్చిన వారికి రూ.1000 జరిమానా విధించాలని స్పష్టం చేసింది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 51 (బి) ప్రకారం ఈ కేసులు నమోదు చేస్తున్నారు. (గాడ్సే నిజమైన దేశభక్తుడు)

మరిన్ని వార్తలు