ఆరోజుల్లో అట్లుండే..!

25 Nov, 2018 12:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నాడు మాటకు విలువ

నేడు మూటకు అందలం

ఎన్నికల సరళిపై వృద్ధుల మనోగతం

సాక్షి, వికారాబాద్‌: ‘నేటి ఎన్నికల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. నాడు ఎన్నో కిలోమీటర్లు నడిచి ఓటు వేసేవాళ్లం.. పైగా మాటకు విలువ ఇచ్చేవాళ్లం.. ఇప్పుడేమో డబ్బుల మూటకే అందలం ఎక్కిస్తున్నారు. పెద్దోళ్లు ఏది చెబితే అదే గుర్తుకు వేసేవాళ్లం.  అప్పుడు కాగితంపై గుర్తు చూపి ప్రచారం చేసేవారు. ఇప్పుడు పొద్దుగాల నుంచి రాత్రి వరకు మైకులు మోగిస్తున్నారు. నేడు హామీలు గుప్పిస్తూ, డబ్బులు పంచుతూ ప్రచారాన్ని అదరగొడుతున్నారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు సైతం ఇప్పుడు ఎవరికి వేస్తున్నారో తెలియడం లేదు’ అని ప్రజలు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో శనివారం కొందరి వృద్ధులు, విద్యావేత్తలను ‘సాక్షి’ పలకరించగా నాటి ఎన్నికలపై వెలిబుచ్చిన వారి అభిప్రాయాలు ఇవీ..

నాలుగు కిలోమీటర్లు నడిచివెళ్లి ఓటు వేసేవాళ్లం...
కందుకూరు: ముప్పై ఏళ్ల క్రితం ఎన్నికలు అంటే ఎవరికి తెలిసేది కాదు. ఊరి పెద్ద పంపిన కావలికార్లు ముందు రోజు వచ్చి రేపు ఓటు వేయాలని చెప్పి పోయేవారు.  ఆ రోజు మా తండా నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పులిమామిడికి నడిచి వెళ్లి ఓటు వేశావాళ్లం. అక్కడే కల్లు లేదా అంబలి ఇస్తే తాగి వచ్చే వాళ్లం. ఇప్పట్లా జోరుగా ప్రచారం లేదు. డబ్బులు పంచుడులేదు. చేతగాని ముసలోళ్లు ఉంటే ఎడ్ల బండిపై ఎక్కించుకుని ఓటు వేయడానికి తీసుకుపోయేది. 
– వి.నేచ్చానాయక్, దావూద్‌గూడతండా, కందుకూరు  

ఎడ్ల బండిపై వెళ్లేటోళ్లం...
షాబాద్‌(చేవెళ్ల): గతంలో ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్లు ఎండ్లబండిపై పోయి ఓటు వేసేవాళ్లం. మా ఇంట్లో పెద్ద మనిషి ఎవరికి ఓటు వేయమంటే వారికే ఓటు వేసేటోళ్లం. పటేల్‌ ఇంటికి వచ్చి ఈ గుర్తుకు ఓటు వేయాలని చెబితే అదే గుర్తుకు వేసేవాళ్లం. మాకు ఏ ఆపతి వచ్చినా ఆయన వద్దకు పోయి చెబుతుంటిమి. ఆయన సమస్య పరిష్కరించేవారు. కల్లు, సారాకు లొంగేవారు కాదు.  మళ్లీ వచ్చి ఎవరు ఎవరికి ఓటు వేశారని అడిగే వారు కాదు. మా జమానాలో ఎన్నికలంటే ఇంత ప్రచారం జరిగేది కాదు. నాయకులు ఇంటింటికి వచ్చి దండాలు పెట్టి కాళ్లు మొక్కేవారు కాదు. ఇప్పుడు పొద్దుగాల నుంచి పొద్దుమూకినదాకా మైకులు పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారు.  అప్పటి రోజుల్లోనే ఒక పెద్ద మనిషి చెప్పినట్లు వినేవాళ్లం. ఇప్పుడు ఎవరు చెప్పినా వినడం లేదు. ఓటు కూడా ఎవరికి వేస్తారో తెలియడం లేదు.  మానవత విలువలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి.                        
– మణెమ్మ, బోడంపహాడ్‌ గ్రామం

నచ్చిన వ్యక్తికే ఓటేస్తా...
ధారూరు: వికారాబాద్‌ మండలం గూడుపల్లి గ్రామం నుంచి నాగారం గ్రామానికి 9 ఏళ్లకే పెళ్లి చేసుకుని వచ్చాను. 21 ఏళ్లకు ఓటుహక్కు ఉండేది.  25 ఏళ్లకు నడుచుకుంటూ పోలింగ్‌ బూత్‌ వరకు వెళ్లి ఓటేసీ వచ్చా. మా కాలంలో అభ్యర్థి ప్రచారం ఇల్లిల్లు తిరిగి కాదు. అందరిని ఒక దగ్గర చేర్చి తన గురించి చెప్పివెళ్లేవారు. ఆ తర్వాత ఓటేసేవాళ్లం. ఇపుడేమో మద్యం, మాంసాహారంతో పాటు నగదు ఇస్తేనే ఓటేస్తున్నారు. మా కాలంలో డబ్బుతో ఓటు అంటేనే చచ్చినంత పని. నమ్మి ఓటేసీవాళ్లం. ఇపుడేమో ఓటును అమ్ముకుని ఓటేస్తున్నారు. ఇప్పటి వరకు ఓటువేయకుండా ఉండలేదు. భర్త, కొడుకులు, మనుమళ్లు ఓటు కోసం చెప్పినా తనకు నచ్చిన ట్లుగానే ఓటేశాను. ఇప్పుడు రాజకీయ విలువలు పూర్తిగా దిగజారీ పోయాయి. ఇపుడు ఎన్నికలప్పుడే హామీలు చెప్పి తిరిగి ప్రజల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈసారి మాత్రం తప్పక ఓటేస్తా.  
– 96 ఏళ్ల జైదుపల్లి రత్నమ్మ

తాగుడుకు బానిసవుతున్న యువత...
షాబాద్‌(చేవెళ్ల): మా కాలంలో ఓటు వేయాలంటే దేవుని గుడికి వెళ్లి తిలకం దిద్ది, మొక్కి ఓటు వేసేవాళ్లం. అప్పట్లో గ్రామంలో ఒక నలుగురు పెద్ద మనుషులు ఇండ్ల వద్దకు వచ్చి పలానా గుర్తుకు ఓటు వేయాలని చెప్పేవారు. ఆయన మాట తీసి వేయకుండా మాటకు కట్టుబడి ఓటు వేసేవాళ్లం. ఏ కష్టమొచ్చిన అతని వద్దకే వెళ్లితే సమస్యలను పరిష్కరించేవారు. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు, మద్యం ఎక్కువ ఎవరు ఇస్తే వారికే ఓటు వేస్తామని చెబుతున్నారు. రోజుకో పార్టీలో తిరుగుతు అటు నాయకులను, ఇటు ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కులానికి ఒక పెద్ద మనిషిని పిలిపించి మీ ఓట్లు పలానా వ్యక్తికి వేయాలని చెబితే ఆయన మాటనే వేదవాక్కుగా నమ్మేవారు. ఇప్పుడు కుల రాజకీయాలు ఎక్కువ కావడంతో ఎవరికి వారు మా కులానికి ఏమీ ఇస్తావనీ, మావి వంద ఓట్లు ఉన్నాయని బేరాసారాలు అడుతున్నారు. నాటికి, నేటికి ఎన్నికల ప్రచారాల్లో నాయకుల హడావిడి, పార్టీల కండువాలు మార్చడంలో నాయకులు పోటీపడుతున్నారు. మద్యం ఏరులై పారుతుంది. యువత తాగుడుకు బానీసై ఎవరికి ఓటు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలకు నైతిక విలువలు తగ్గిపోయాయి.              
– కిష్టయ్య జ్యోషి, విద్యావేత్త, షాబాద్‌

నాడు అందరిదీ ఒకే మాట...
నందిగామ: నాడు.. నేడు జరుగుతున్న ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. నాకు తెలిసినంత వరకు నేను సుమారు 12 సార్లు (ఎమ్మెల్యే ఎన్నికలకు) ఓటు వేశాను. అప్పట్లో కొంత మంది పెద్దలు కూర్చుని అందరం కలిసి నిర్ణయించుకొని తమకు నచ్చిన వారికి ఓటు వేసే వారం.  కొందరు ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్లి భోజన సమయంలో ఊర్లోకు వచ్చి ఓటు వేసేవారు. మరికొందరు ఓటు వేసిన తర్వాతనే పనులనిమిత్తం వెళ్లేవారు.   గ్రామంలోని అందరం ఒకే మాటకు కట్టుబడి ఉండేవాళ్లం. పెద్దల మాటకు గౌరవం ఇచ్చేవారం.  కానీ ప్రస్తుత సమాజంలో కొడుకు ఎవ్వరికి ఓటు వేస్తున్నాడో, భార్య ఎవ్వరికి ఓటు వేస్తుందో, కోడలు, కూతురు ఇలా ఎవ్వరు ఎవ్వరికి ఓటు వేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. మాట మీద నిలబడే రోజులు పోయాయి.   ఇలా ఉంటే మన ఓటుతో గెలిచిన వారిని పనిచేయమని ప్రశ్నించే హక్కును కోల్పోతాం. ఎన్నికలకు ముందు వారు ఇచ్చే డబ్బులకు అశపడటం ఎందుకు.. మన కష్టాన్ని నమ్ముకొని జీవించాలి. పనులు మానుకొని వారి వెంట తిరిగే బదులు , మన పని మనం చేసుకోవాలి. వారు ఎన్నికల వరకు మాత్రమే మందు తాపగలరు, కానీ తర్వాత .. కావున తమ కష్టాన్ని నమ్ముకోవాలి. 
– గోవిందు శర్వయ్య, నర్సప్పగూడ, 

ఓటు వేయకుంటే సచ్చినట్లే అనేవారు...
ఇబ్రహీంపట్నం రూరల్‌: అప్పట్లో ఓటు వేయకుంటే సచ్చినంత విలువ అని పెద్దలు చెబుతుండే వారు. ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బుల రాజకీయం నడుస్తోంది. నాకు ప్రస్తుతం 85 సంవత్సరాలు. మొదటి సారిగా ఆవుగుర్తుకు   ఓటు వేశాను. రెండున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసేది.   ఓటు వేసి మళ్లీ పనులకు వెళ్లెవాళ్లం. అప్పట్లో రెండు పార్టీలు మాత్రమే ఉండేది. ఎవ్వరి ఇష్టం వచ్చిన దానికి వారు ఓటు వేసే వాళ్లం. ఇప్పుడు ఓటు హక్కు వచ్చినప్పటికీ భయంతో ఓటు వేసే రోజులివి.      
– ఇబ్రహీం జంగయ్య, ఉప్పరిగూడ

నేడు మైకుల మోత...
దౌల్తాబాద్‌: నాకు 75 సంవత్సరాలు. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఓటు వేశాను. అయితే అప్పట్లో ఎన్నికల హడావుడి చాలా తక్కువ. చాలా తక్కువ కాలంలో మూడు నాలుగు రోజులు మాత్రమే ఇంటింటికి వచ్చి ఓటు కోసం ప్రచారం చేసేవారు. ఇప్పుడు రెండు నెలల నుండి ఊర్లలో మైకులతో ప్రచారం జోరు చేస్తున్నారు. అప్పుడు ఓటుకు వచ్చే వారు కాగితంపై గుర్తు చూపి ప్రచారం చేసేవారు. ఇప్పుడు పొద్దుగాల నుంచి రాత్రి వరకు మైకులు మోగిస్తున్నారు. ఓటునాడు పోలింగ్‌బూత్‌ దగ్గర తమ గుర్తు ఇది అని చెప్పేవారు. ఇప్పుడు మిషన్లు వచ్చాయి. అప్పట్లో పైసలు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు వందలకు వందలు, రోజూ టిఫిన్లు, భోజనం కూడా పెడుతున్నారు. ఇలా అప్పటికి ఇప్పటికి చాలా తేడాగా ఉంది. 
– రామప్ప, దౌల్తాబాద్‌

నిజాయితీగా ఓటు వేశాం...
ఇబ్రహీంపట్నం రూరల్‌: స్వాతంత్య్రం రాగానే మొట్టమొదట జరిగిన ఎన్నికల్లో ఓటు వేశాను. నాకు ఇప్పుడు 83 ఏళ్లు. అప్పుడు నీతినిజాయితీగా ఓటు వేసేది. కార్లు, మోటారు సైకిళ్లు అప్పట్లో లేవు. ఇప్పుడు కార్లల్లో తీసుకెళ్లి ఓటు వేయించుకుంటున్నారు. ఇష్టం ఉంటే ఓటు వేసేది లేకపోతే లేదు. ఎక్కువగా ఓటు వేయాలని పెద్దలు చెబుతుండేది. 35 యేళ్లుగా డబ్బుల రాజకీయమే నడుస్తోంది.
– మంత్రి ఎల్లయ్య,  ఉప్పరిగూడ 

మరిన్ని వార్తలు