‘పరీక్ష’ మొదలైంది!

10 Apr, 2017 12:45 IST|Sakshi
‘పరీక్ష’ మొదలైంది!

కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
 వచ్చే నెల 6 వరకు కొనసాగనున్న ప్రక్రియ
 తొలి రోజు 1407 మంది హాజరు  పర్యవేక్షించిన సీపీ, రూరల్ ఎస్పీ

 
వరంగల్ :  పోలీసు కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శుక్రవారం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో ఎంపికైనవారికి హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్)లో, రూరల్ పోలీసు విభాగం పరిధిలో ఎంపికైన వారికి కేయూ మైదానంలో ఫిజికల్ టెస్ట్‌లు జరిగారుు. గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షల్లో 32,070 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఉదయం 5 గంటలకే అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే మైదానాలకు చేరుకున్నారు. ముందుగా అభ్యర్థుల ఆధార్ కార్డులను పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలి ముద్రలను సేకరించారు. అనంతరం 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారి శారీరక కొలతలు తీసుకున్నారు. శారీరక కొలతల పరంగానూ అర్హులేనని ధ్రువీకరణ పొందిన వారికి ఇతర ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జేఎన్‌ఎస్‌లో 557 మంది హాజరు..
హన్మకొండ జేఎన్‌ఎస్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల పరుగు పోటీలను ఉదయం 6 గంటలకు సీపీ సుధీర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ వచ్చే నెల 6 వరకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతాయన్నారు. కాగా, తొలిరోజున జేఎన్‌ఎస్‌కు 557 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక్కడ నిర్వహించిన 800 మీటర్ల పరుగు పందెంలో 70 మంది మహిళా అభ్యర్థినులు అర్హత సాధించడంతో వారికి ఈవెంట్స్ నిర్వహించారు.  
 
కేయూ మైదానంలో 850 మంది...

వరంగల్ రూరల్ పోలీసు విభాగం పరిధిలో కానిస్టేబుళ్ల భర్తీకి కాకతీయ యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన ఫిజికల్ టెస్ట్‌లను ఉదయం 6 గంటలకు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా ప్రారంభించారు. ఆయన  మాట్లాడుతూ తొలిరోజు పరీక్షలకు 850 మంది హాజరయ్యారన్నారు.ఈ పరీక్ష కేంద్రాల్లో అదనపు డీసీపీ యాదయ్య, వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ జాన్ వెస్లీ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ , పరిపాలన అధికారి స్వరూపారాణి, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్ధన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్‌రావు, ఈశ్వర్‌రావు, రవీందర్‌రావు, రమేష్‌కుమార్, డీఎస్పీలు రాజమహేంద్రనాయక్, సత్యనారాయణరెడ్డి, సుధీంద్ర, రాంచందర్‌రావు పాల్గొన్నారు.
 
‘పాలిటెక్నిక్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది’    

వరంగల్ : కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం జిల్లాలో నిర్వహిస్తున్న అర్హత పరీక్షల్లో పాలిటెక్నిక్ చదివిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ధర్మభిక్షం అనే అభ్యర్థి ఓ ప్రకటనలో ఆరోపించాడు. శుక్రవారం జరిగిన 800 మీటర్ల పరుగు పందేన్ని తాను 166 సెకన్లలో పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం జరిగిన సర్టిఫికెట్ల  పరిశీలనలో ‘నీవు పాలిటెక్నిక్ విద్యార్థివి అయిందున అనర్హుడివి’ అంటూ పోలీసు అధికారులు తనను ఇతర పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నోటిఫికేషన్ 9వ పేజీలో ఎస్సీ, ఎస్టీలు, పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంటర్మీడియట్ పాస్ లేదా ఫెయిల్ లేదా తత్సమాన అర్హత ఉంటే చాలని పేర్కొన్నప్పటికీ తనకు అవకాశం రాకపోవడం అన్యాయమన్నాడు. పేద వర్గానికి చెందిన తనకు పోలీసు అధికారులు మిగిలిన పోటీలకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు.
 
 
 

>
మరిన్ని వార్తలు