కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా ?

13 Nov, 2014 17:58 IST|Sakshi
కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా ?

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ హిట్లర్ కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో టీటీడీపీ ఎమ్మెల్యేలను వారం పాటు సస్పెండ్ చేశారు. దాంతో ఎర్రబెల్లితోపాటు మిగతా టీటీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత రెండు చోట్ల తన వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసుకున్నారని... దీనిపై సమాధానం ఇవ్వాలని తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు. ఈ విషయం వాస్తవమా కాదా అన్న విషయం సభలో వెల్లడించాల్సిన బాధ్యత  టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందని ఎర్రబెల్లి అన్నారు.

ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా రెండురోజులగా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా గందరగోళం సృష్టిస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యలను నిలదీస్తామనే ఉద్దేశ్యంతోనే తమను సభ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేసేశారని ఆరోపించారు. ప్రభుత్వమే కాదు స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం, స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టెందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కవిత విషయంపై సభలో ప్రశ్నిస్తే.... నా కూతురు గురించి మాట్లాడుతారా అంటూ కేసీఆర్, తమ సీఎం కూతురు గురించి మాట్లాడుతారా అంటూ టీఆర్ఎస్ సభ్యులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కూతురంటే నిజాం కూతురా? ఆమె గురించి ప్రశ్నించడం తప్పా అని విలేకర్ల ఎదుట ఎర్రబెల్లి ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు