కుటుంబానికంతా కరోనా

15 Apr, 2020 12:40 IST|Sakshi

భర్త, భార్య, ఇద్దరు కుమారులకు  వైరస్‌

ఓ మహిళ అంత్యక్రియలకు వెళ్లడంతో సోకినట్లు అనుమానం

వణికిస్తున్న మహమ్మారి.. మంగళవారం ఐదు కేసులు నమోదు

జిల్లాలో 47కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య

సాక్షి, రంగారెడ్డి జిల్లా:జిల్లాలో కరోనా పంజా విసురుతునే ఉంది. మంగళవారం ఒక్కరోజే ఐదు కేసులు నమోదుకావడంతో ప్రజలు వణికిపోతున్నారు. బాలాపూర్‌ ప్రాంతంలోని భిస్మిల్లాకాలనీకి చెందిన ఓ కుటుంబానికంతా పాజిటివ్‌గా తేలింది. భర్త, భార్య, 14, 10 ఏళ్ల కుమారులిద్దరికీ కరోనా వ్యాప్తి చెందినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. వారం రోజుల క్రితం తలాబ్‌కట్టలో మరణించిన ఓ మహిళ అంత్యక్రియలకు వీరు హాజరైనట్లు సమాచారం. సదరు మహిళకు కరోనా పాజిటివ్‌ అని మరణం తర్వాత తెలిసింది. ఈమె నుంచి వీరికి వ్యాప్తి చెంది ఉండొచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నలుగురికి అనుమానిత లక్షణాలు ఉండటంతో చార్మినార్‌లోని యునాని ఆస్పత్రికి స్వతహాగా వెళ్లి ఈనెల 12 నమూనాలు ఇచ్చారు. వీటి ఫలితాలు మంగళవారం వెలువడగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. చికిత్స కోసం వీరిని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

కంటైన్మెంట్‌ జోన్‌గా బాలాపూర్‌
ఇప్పటికే బాలాపూర్‌ ప్రాంతంలో పలు కేసులు నమోదుకాగా.. తాజా వాటిని కలుపుకుంటే మరిన్ని పెరిగాయి. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ క్లస్టర్‌గా యంత్రాంగం ప్రకటించింది. 14 రోజులపాటు బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలోకి.. ఇక్కడివారు బయటకు వెళ్లకుండా వీలులేదు. ఎక్కడికక్కడ పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 

మంఖాల్‌ వాసికి  కూడా..
తుక్కుగూడ పరిధిలోని మంఖాల్‌ వాసికి కూడా పాజిటివ్‌గా నిర్ధరణ జరిగింది. 75 ఏళ్ల వృద్ధునికి అనారోగ్యం ఉండటంతో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనుమానిత లక్షణాలను గుర్తించిన అక్కడి వైద్యులు నమూనాలు తీసి ల్యాబ్‌కు పంపారు. కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో ఇతడిని కూడా గాంధీకి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతనికి వైరస్‌ ఎలా సోకిందన్న విషయాన్ని అధికారులు ఆరాతీస్తున్నారు. ఈయనతో సన్నిహితంగా మెలిగిలిన మరో 13 మందిని రావిర్యాలలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు. ఇరుగు పొరుగువారు, కుటుంబ సభ్యులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. తాజా ఈ ఐదు కేసులను కలుపుకుంటే జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 47కు చేరుకుంది. వరుసగా రెండు రోజులు ఐదు చొప్పున కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు