కరోనా కలవరం

7 Apr, 2020 10:01 IST|Sakshi

హైదరాబాద్‌ జిల్లాలో పెరుగుతున్న కేసులు

గాంధీలో ప్రస్తుతం 138 బాధితులు  

350 మందికి పైగా అనుమానితులు

ఫీవర్‌లో స్టాఫ్‌ నర్సుకు కరోనా నెగిటివ్‌

ఊపిరి పీల్చుకున్న ఆస్పత్రి వర్గాలు

సాక్షి, సిటీబ్యూరో: చాపకిందనీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ నగర వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా సోమవారం హైదరాబాద్‌ జిల్లాలో మరో 9 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిసింది.  ప్రస్తుతం గాంధీలో 138 కరోనా పాజిటివ్‌ బాధితులు ఉన్నారు. 350 మంది కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నారు. 

ఫీవర్‌ ఆస్పత్రి స్టాఫ్‌ నర్సుకు నెగిటివ్‌..
కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ సోమవారం నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి 11 మంది వచ్చారు. వీరిలో ఒక మహిళ, ఒక మైనర్‌ కూడా ఉన్నట్లు తెలిసింది. వైద్యులు వీరిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసుకుని, వారి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 23 మంది అనుమానితులు ఉన్నారు. గత 15 రోజులుగా ఆస్పత్రి కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో విధులు నిర్వహిస్తున్న ఒక స్టాఫ్‌నర్సు కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతుండటంతో మూడు రోజుల క్రితం ఆమె నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. ఆమెకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టు సోమవారం ఉదయం వచ్చింది. పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ రావడంతో ఆస్పత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆమె ప్రస్తుతం సాధారాణ ప్లూతో బాధపడుతున్నట్లు నిర్ధారించి ఆ మేరకు చికిత్సలు అందిస్తున్నారు. ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి నుంచి రిఫరల్‌పై వచ్చిన ఓ వ్యక్తి కి పాజిటివ్‌ రావడంతో అతడిని  వెంటనే గాంధీ ఐసీయూకి తరలించినట్లు తెలిసింది.

ఛాతీ, కింగ్‌కోఠిఆస్పత్రుల్లోనూ చికిత్స..
ప్రస్తుతం ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 20 పాజిటివ్‌ కేసులు ఉండగా, మరో 50 మంది కరోనా అనుమానితులు ఉన్నట్లు తెలిసింది. వీరంతా కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కింగ్‌కోఠి ఆస్పత్రిలో మరో వంద మంది వరకు అనుమానితులు ఉన్నారు. వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు తెలిసింది. వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. మెడికల్‌ రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుండటం, ఐసోలేషన్‌ వార్డుల్లో ఉక్కపోతకు తోడు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

మరిన్ని వార్తలు