ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు

10 Dec, 2018 11:59 IST|Sakshi

అధికారిక కవర్‌లో రాకుంటే తిరస్కరణ

లెక్కింపు ప్రక్రియ అంతా వీడియో చిత్రీకరణ

    సాక్షి, కామారెడ్డి అర్బన్‌: శాసనసభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 11న మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుంది. తొలుత రిటర్నింగ్‌ అధికారి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు చేపడతారు. అర గంట వెసులుబాటు తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు. 

  • పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు కోసం ప్రత్యేకమైన టేబుల్, ఏర్పాట్లు చేస్తారు. సహాయ రిటర్నింగ్‌ అధికారి సహకారంతో రిటర్నింగ్‌ అధికారి బాధ్యత వహిస్తారు. 
  • ఓటరు నుంచి వచ్చే ప్రతి పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రతం ఫారం–13బిలో లోపల ఉంచిన కవర్‌లో ఉంటుంది. ఈ కవర్, ఫారం–13ఎలో ఎలక్టర్‌ చేసిన డిక్లరేషన్‌తో పాటు మరో పెద్ద కవర్‌లో ఉంటుంది. ఈ పెద్ద కవర్‌ ఫారం
  • 13సిలో ఉండి రిటర్నింగ్‌ అధికారి చిరుమానాపై ఉండాలి. 
  • లెక్కింపు ప్రారంభానికి అంటే ఉదయం 8 గంటల తర్వాత వచ్చే ఏ పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రం కలిగిన ఫారం–13–సి కవర్‌ను రిటర్నింగ్‌ అధికారి తెరవడు. ఫారం–13–సిలో ఉన్న పైకవర్‌ మీద నోట్‌ రాస్తాడు. ఈ కవర్లలోని ఓట్లను లెక్కించడం జరగదు. అలాంటి కవర్లనింటినీ ఓ ప్యాకెట్‌గా చేసి సీలు వేస్తారు. 
  • పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి డిక్లరేషన్‌ పత్రాలపై సంతకాలు, కవర్లు అన్ని సరిచూసిన తర్వాతే రిటర్నింగ్‌ అధికారి దాని చెల్లుబాటును నిర్ణయిస్తారు.
  • పోస్టల్‌ బ్యాలెట్‌పై ఓటు నమోదు కాని పక్షంలో, ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు నమోదు చేసినా, తప్పుడు బ్యాలెట్‌ పేపర్‌ ఐనా, బ్యాలెట్‌ పత్రం పూర్తిగా చిరిగి పోయినా, ఎలక్టర్‌కు పంపిన కవర్‌లోదాన్ని తిరిగి పంపకపోయినా, నమోదు చేసిన గర్తు ఏ అభ్యర్థికి ఓటు వేశారో నిర్ధారణ కాకుండా సందేహం కలిగించే విధంగా ఉన్నా, ఓటరును గుర్తించే ఏ గుర్తుకాని, రాతకాని బ్యాలెట్‌ పత్రం రాసి వుంటే చెల్లని ఓటుగా తిరస్కరిస్తారు. 
  • చెల్లని ఓట్లను, ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్లను లెక్కించి ఫారం–20లో ఫలితం నమోదు చేస్తారు. 
  • పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపైనే అభ్యర్థి గెలుపు నిర్ధారితమయ్యే సందర్భంలో రిటర్నింగ్‌ అధికారి అనివార్యంగా వాటిని మళ్లీ ధ్రువీకరణ జరిపి ప్రతి అభ్యర్థి పక్షాన లెక్కింపబడిన ఓట్లను మరోసారి పరిశీలించి సంఖ్య సరిపోయిందా లేదా ఫలితానికి తుది రూపం ఇస్తారు. 
  • మళ్లీ లెక్కింపు జరిగినప్పుడు రహస్య భగ్నం కాని విధంగా మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తారు. దాని సీడీ, క్యాసెట్‌ను భద్రపరుస్తారు.
మరిన్ని వార్తలు