బెల్లంపల్లి గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌

2 Aug, 2019 09:03 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

సాక్షి, బెల్లంపల్లి : బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల వసతిగృహంలో ఉంటున్న దాదాపు పది మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు కోలుకుంటున్నారు.

తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాల వసతిగృహంలో బుధవారం రాత్రి విద్యార్థులకు బెండకాయ కూర, పప్పుతో భోజనం అందించారు. వసతిగృహంలో ఉన్న ఆర్వో ప్లాంట్‌ పనిచేయకపోవడంతో బయట నుంచి నీళ్లు తెప్పిం చారు. భోజనం చేసిన విద్యార్థులు ఆ నీళ్లు తాగారు. కొద్ది సేపటికే కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వసతిగృహ వైద్య సిబ్బంది విద్యార్థులకు మాత్రలు వేశారు. ఆ మాత్రలు వేసుకున్నా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు.

రక్తపు విరేచనాలు..
మాత్రలు వేసుకున్నా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడకపోగా ఒకరిద్దరు రక్తపు విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో విద్యార్థులను బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసున్న ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో ముజాఫర్‌ ఖాద్రి, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఈవోపీఆర్డీ ఎన్‌.వివేక్‌రాం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఇందుకు గల కారణాలను ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని, వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. 

కలుషిత నీరు తాగడం వల్లే..
కలుషిత నీటిని తాగడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. కాగా పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌ పనిచేయకపోవడంతో వసతిగృహ అధికారులు పట్టణంలోని ఓ ప్లాంట్‌ నుంచి మినరల్‌ వాటర్‌ తెప్పించారు. మినరల్‌ వాటర్‌ తాగినా విద్యార్థులకు ఇలా జరగడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సంఘటన జరిగిందని, విద్యార్థులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి సంఘాల కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు