‘నిధుల్ని దారి మళ్లిస్తున్న కేసీఆర్ సర్కారు’

13 Oct, 2016 22:38 IST|Sakshi
‘నిధుల్ని దారి మళ్లిస్తున్న కేసీఆర్ సర్కారు’

హైదరాబాద్: రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని భారతీయ జనతాపార్టీ(బీజేపీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్టుబడి రాయితీ కింద ఆర్నెళ్ల క్రితం కేంద్రం విడుదల చేసిన నిధులను ఇప్పటికీ రైతులకు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని మండిపడింది. ఇన్‌పుట్ సబ్సీడీ కింద ఎన్డీఏ ప్రభుత్వం రూ.791 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వెంటనే రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం సచివాలయంలోని సమతా బ్లాక్ ఎదుట బీజేపీ శాసనసభ పక్షనేత జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని, ఇన్‌పుట్ సబ్సీడీ ఇవ్వకుండా జాప్యం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిస్తే.. స్పష్టత ఇవ్వకుండా దాటవేశారని, దీంతో నిరసన చేపట్టినట్లు తెలిపారు. రబీ సీజన్లో రాయితీ విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు అరకొరగా మాఫీచేసి చేతులెత్తేశారని విమర్శించారు. అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సీడీ ఇచ్చేవరకు ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. ధర్నా అనంతరం పోలీసులు వారిని అరెస్టుచేసి తర్వాత విడుదల చేశారు.

మరిన్ని వార్తలు