తెలంగాణ రాజకీయ భీష్ముడు

23 Dec, 2014 02:30 IST|Sakshi
వెంకటస్వామి భౌతికకాయాన్ని తమ నివాసానికి తీసుకువెళ్తున్న ఆయన కుమారులు వివేక్, వినోద్

* ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం  
* కార్మిక పక్షపాతిగా పేరు తె చ్చుకున్న కాకా
* 7 సార్లు ఎంపీగా విజయబావుటా
* రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
* కేంద్రమంత్రిగా, సీడబ్ల్యూసీ సభ్యుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో బాధ్యతలు


సాక్షి, హైదరాబాద్/గోదావరిఖని: రాజకీయ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామిది సుదీర్ఘ ప్రస్థానం. అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనను వరించిన పదవులు ఎన్నో. 1929 అక్టోబర్ 5న హైదరాబాద్‌లో మల్లయ్య, పెంటమ్మ దంపతులకు జన్మించిన కాకాకు 1944లో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న వెంకటస్వామి కార్మిక నేతగా మంచి గుర్తింపు పొందారు. 1957లో ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీకి 1961-64 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు. పేదలకు గుడిసెలను నిర్మించాలనే లక్ష్యంతో ‘నేషనల్ హట్స్ సొసైటీ’ని ఏర్పాటు చేశారు. వేలాది మంది నిరుపేదలకు గుడిసెలు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం 1973లో హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో అంబేద్కర్ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి 1967, 1971, 1977లలో ఎంపీగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావుల హయాంలో కార్మిక, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ర్టంలో శాసనమండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2009లో 15వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో వెంకటస్వామికి టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో తన తనయుడు వివేక్‌ను రాజకీయ అరంగేట్రం చేయించారు. కాకా మరో తనయుడు జి.వినోద్ కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

తెలంగాణను స్వప్నించి.. కనులారా వీక్షించి
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడి గా పనిచేసిన సమయంలో వెంకటస్వామి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు.  ప్రత్యేక తెలంగాణ రా్రష్ట్రాన్ని చూడడమే తన స్వప్నమని అనేకమార్లు పేర్కొన్న కాకా... రెండు మూడుమార్లు తీవ్ర అస్వస్థతకు గురైనా మళ్లీ కు దుటపడ్డారు. తెలంగాణ రా్రష్ట్రాన్ని చూసేం దుకే తాను బతికి ఉన్నానని ఆయన చెప్పేవారు. అనుకున్న ట్టే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూశారు. కాంగ్రెస్‌లో వివాదరహితునిగా, దళిత నేతగా మంచి పేరు సంపాదించుకున్న ఆయన ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను ఆశించారు. అయితే రాజకీయ సమీకరణాల వల్ల ఆ పదవు లు పొందలేకపోయారు. ఈ అసంతృప్తితోనే 2011లో బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అ నంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా పని కిరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా సీడబ్ల్యూసీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు.

గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం కోసం..
సింగరేణి సంస్థలో 1996 కంటే ముందు గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు. ఆ సమయంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన కాకా కేంద్రంతో మాట్లాడి గని కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో కీలక భూమిక పోషించారు. 1998లో జరిగిన వేతన ఒప్పందం సమయంలో సింగరేణి వద్ద డబ్బులు లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి రూ.400 కోట్లు తీసుకుని కార్మికులకు వేతనం చెల్లించేలా చూశారు. కాజీపేట నుంచి సిర్పూర్‌కాగజ్‌నగర్ వరకు రామగిరి ప్యాసింజర్ రైలును వేయించారు. సింగరేణి కార్మికులు ఆయనతో తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలు తీర్చుతూ కార్మిక పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. సింగరేణిలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ బలోపేతం కోసం విశేషంగా కృషి చేశారు.

కాకా రాజకీయ ప్రస్థానం
* 1957-62, 1978-84 మధ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక, 1978-82 మధ్య రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు
* 1967లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
* 1971, 1977, 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలుపు
* కేంద్ర కేబినెట్‌లో కార్మిక, పౌర సరఫరాలు, పునరావాసం, చేనేత, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు
* 1961-64 మధ్య ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా కొనసాగారు
* 1982-84 మధ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు
* కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, లోక్‌సభ డిప్యూటీ లీడర్‌గానూ వ్యవహరించారు.

ప్రముఖుల సంతాపం
అంకితభావంతో సేవలందించారు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పార్లమెంటేరియన్ జి.వెంకటస్వామి మృతి రాష్ట్రానికి ఎంతో నష్టం. పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు అంకితభావంతో సేవలందించారు. ఆయన మృతితో రాష్ట్రం ముఖ్యనేతను కోల్పోయింది.
 - నరసింహన్, గవర్నర్

పేదల కోసం పాటుపడ్డారు
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి.వెంకటస్వామి మరణం బలహీన వర్గాలకు ఎంతో నష్టం. ఆయన  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ  సానుభూతి వ్యక్తం చేస్తున్నా.
 - బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి

తీరని లోటు
వెంకటస్వామి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు.
- చంద్రబాబునాయుడు, ఏపీ ముఖ్యమంత్రి

కార్మికుల కోసం ఎంతో కృషి చేశారు
సీనియర్ పార్లమెంటేరియన్ జి.వెంకటస్వామి మృతికి ప్రగాఢ సంతాపం. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి. కార్మికులు, కర్షకుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు.
- జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ అధినేత

ప్రగాఢ సానుభూతి
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి, కాకా మృతికి సంతాపం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
-ఎన్.రఘువీరారెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు

తెలంగాణ కాంగ్రెస్‌కు భీష్మాచార్యుడు
తెలంగాణ కాంగ్రెస్‌కు వెంకటస్వామి భీష్మాచార్యుడు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నా.  
 - డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ

ఎంతో బాధ కలిగించింది
వెంకట స్వామి మృతి చెందారన్న వార్త ఎంతగానో బాధ కలిగించింది.  ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
- కె. జానారెడ్డి, టీసీఎల్పీ నాయకుడు

దళిత ఉద్యమాలకు దిక్సూచి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి దళిత ఉద్యమాలకు దిక్సూచిలా వ్యవహరించారు. అలాంటి నాయకుడు మృతి చెందడం దురదృష్టకరం.
-జాన్ వెస్లీ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు