‘సరిహద్దు’లో గంజాయి గుప్పు

5 Mar, 2018 02:00 IST|Sakshi

రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో విస్తృతంగా సాగు

అంతర్రాష్ట్ర రవాణాకు వీలుండే ప్రాంతాలే టార్గెట్‌

విత్తనాలు, పెట్టుబడి ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్న మాఫియా

మూడు నెలల్లో పంట చేతికి.. గుట్టుగా ప్రధాన నగరాలకు..

ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులకు రవాణా

అక్కడి నుంచి విద్యార్థుల చేతుల్లోకి..

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో గంజాయి మళ్లీ గుప్పుమంటోంది. సరిహద్దు ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగవుతోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, అంతర్రాష్ట్ర రవాణాకు సులువుగా ఉన్న గ్రామాల్లో సాగు జోరందుకుంటోంది. విత్తనాలు, పెట్టుబడి ఇచ్చి మరీ అంతరపంటగా పండించేలా రైతులను మాఫియా ప్రోత్సహిస్తోంది. 3 నెలల్లో చేతికొస్తున్న పంటను గుట్టుగా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలకు సులువుగా రవాణా చేస్తోంది. అక్కడి నుంచి కాలేజీలు, పబ్బులు, విద్యార్థుల చేతుల్లోకి వెళ్తోంది.

పెట్టుబడి అంతా మాఫియాదే
ఢిల్లీ, బెంగళూరుకు చెందిన రెండు ప్రధాన గ్యాంగులు రాష్ట్రంలోని నారాయణ్‌ఖేడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ రూరల్, బోధన్, సంగారెడ్డిలోని రేగోడు, వటపల్లి, గాంధారి, ఎస్‌ఎస్‌నగర్, ఉట్నూర్‌ పరిసర ప్రాంతాలతో పాటు వికారాబాద్‌ గ్రామీణ ప్రాంతాలను గంజాయి సాగుకు ఎంచుకున్నాయి. పేద రైతులకు కేజీ చొప్పున గంజాయి విత్తన ప్యాకెట్లు పంచి పెట్టుబడి కింద రూ.5 వేలు అందిస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత తమ మనుషులు వస్తారని వాళ్లకివ్వాలని చెప్పి వెళ్లిపోతున్నారు. ఇలా మాఫియానే పెట్టుబడి పెట్టి గంజాయిని కాపు కాయిస్తోంది.

మూడు నెలల్లో చేతికి..
మిర్చి, మొక్కజొన్న, కంది, పత్తి పంటల మధ్యలో అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్నారు. ‘5.5 నుంచి 7 అడుగుల వరకు పెరిగే గంజాయికి పెద్దగా నీరు అవసరం లేదు. ఉదయం కురిసే మంచుతో కాపుకొస్తుంది. విత్తనం వేసిన 3 నెలల్లోపై చేతికొస్తుంది. ఒక చెట్లు 2 కేజీల గంజాయి ఉత్పత్తి చేయగలదు’అని నారాయణ్‌ఖేడ్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి చెప్పారు.

గంజాయి మొక్క పువ్వు రాలి పడిన ప్రతి చోట మొక్క పెరుగుతుందని, కాపు కాల్చి వేసినా మొలకలొస్తుంటాయని వివరించారు. గతంలో ఎకరాలకెకరాలు కాల్చినా మళ్లీ మొక్కలు మొలిచాయని చెప్పారు. కాగా, గంజాయి మొక్కలోని ఆకులనే మాఫియా ప్రధానంగా ఉపయోగించుకుంటుంది.

కాస్త స్థలంలోనే 2 క్వింటాళ్లు..
ఒక ఎకరా భూమిలో మొక్కజోన్న వేస్తే.. ఆ ఎకరా మధ్యలోనే 10 నుంచి 15 గుంటల వరకు గంజాయి పంట సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేసిన కాస్త పంట ద్వారానే 2 క్వింటాళ్ల వరకు ఉత్పతి చేస్తున్నారు. గంజాయి ఆకు తెంపిన తర్వాత వారం రోజులు ఎండ బెడతారని.. ఎండిన గంజాయికే మంచి డిమాండ్‌ ఉంటుందని రేగోడుకు చెందిన ఓ రైతు వివరించారు.

ఎండిన గంజాయి కేజీ రూ.4 వేల వరకు ధర వస్తుందని, అది బ్రోకర్ల చేతులు మారి ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో రూ.12 వేల వరకు పలుకుతుందన్నాడు. గంజాయి సాగు చేసినందుకు పెట్టుబడిగా ఇచ్చిన రూ.5 వేలతో పాటు చివరన రూ.10 వేలు ఇస్తారని చెప్పాడు. పోలీసులు పట్టుకున్నపుడు కేసులు, బెయిల్‌ తదితరాలు కూడా విత్తనాలిచ్చిన వ్యక్తులే చూసుకుంటారని తెలిపాడు.

ఏడాదిలోనే 70 క్వింటాళ్లు స్వాధీనం..
పంట పండిన ప్రాంతం నుంచి ఆటో ద్వారా బయల్దేరి.. అక్కడి నుంచి జీపు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌.. అలా అలా ముంబై, బెంగళూరులకు గంజాయి చేరుతోంది. అక్కడి నుంచి మాఫియా ద్వారా కార్పొరేట్‌ కాలేజీలు, బార్లు, పబ్బులు, విద్యార్థుల చేతుల్లోకి వెళ్తోందని పోలీసులు తెలిపారు. పంట సమయంలో రూ.4 వేలకు కేజీ కొనుగోలు చేసే బ్రోకర్‌.. మరో బ్రోకర్‌కు రూ.8 వేలకు విక్రయిస్తున్నాడని.. తర్వాత ముంబైకి తరలించే బ్రోకర్‌ రూ.10 వేల చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని సంగారెడ్డి పోలీసులు వివరించారు.

సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల నుంచే 300 క్వింటాళ్ల గంజాయి ప్రతి నెలా మార్కెట్‌లోకి వెళ్తోందని చెబుతున్నారు. ఒక్క ఏడాదిలోనే 70 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు