దోమ..హంగామా

4 Apr, 2020 08:21 IST|Sakshi

నగరంలో పెరుగుతున్న దోమల బెడద

కరోనా విధుల్లో ఎంటమాలజీ విభాగం

పరిమితంగానే ఫాగింగ్‌..

  మురికివాడల్లో సమస్యలు అధికం

సాక్షి, సిటీబ్యూరో: కరోనా నేపథ్యంలో హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీని చేపట్టినట్లు చెబుతోన్న జీహెచ్‌ఎంసీ నిత్యం జరగాల్సిన దోమల నివారణ చర్యల్ని విస్మరించింది. చాలా ప్రాంతాల్లో ఫాగింగ్, తదితర కార్యక్రమాలు జరగడం లేదు. దీంతో స్లమ్స్‌లోనే కాకుండా పలు కాలనీలు, నివాస ప్రాంతాల్లో దోమల తీవ్రతతో జనం అల్లాడుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు దోమల స్వైర విహారం ఇబ్బందులు పెడుతోంది. నివారణ చర్యలు చేపట్టకపోతే త్వరలోనే నగరంలో దోమ కాటు తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. జీహెచ్‌ఎంసీలో దోమల నివారణ కోసం పనిచేస్తున్న ఎంటమాలజీ విభాగంలో ఒక్కో యూనిట్‌కు 18 మంది కార్మికులు, ఒక సూపర్‌వైజర్‌ వంతున 125 టీముల్లో దాదాపు 2375 మంది పనిచేస్తున్నారు. గతంలో డివిజన్‌కు ఒకటి చొప్పున 150 పోర్టబుల్‌ ఫాగింగ్‌  మెషిన్లు మాత్రమే ఉండగా కొద్దికాలం క్రితం హైకోర్టు మందలింపులతో వాటిని 300కు పెంచారు. వీటిల్లో కొత్తవి అసలు వినియోగించడం లేరు.  పెద్ద మెషిన్లు కూడా మరో 50 కొన్నారు. వెరసి దాదాపు 63 పెద్ద మెషిన్లున్నాయి. మొత్తం 150 పోర్టబుల్‌  ఫాగింగ్‌  మెషిన్లలో  130–140 వరకు మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలనేకం.

కరోనా భయాందోళనలతో చాలామంది కార్మికులు విధులకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నివాసాలున్నవారు  తమ స్వగ్రామాలకు వెళ్లి తిరిగి రాలేదు. గ్రామాల నుంచి వారిని రానీయడం లేరని, నగరానికి వెళ్లి ఊర్లోకి కరోనా తీసుకురావద్దని సంబంధిత గ్రామస్థులు వారిని అక్కడే నిలువరించినట్లు సమాచారం.  దీంతో దాదాపు యాభై శాతం సిబ్బంది మాత్రమే పనిచేస్తుండటంతో ఆమేరకు ప్రభావం  ఉంది. మరోవైపు దోమల నివారణ మందుకంటే తమకు కరోనా సోకకుండా ఉండేందుకు హైపోక్లోరైట్‌ పిచికారీనే కావాలని రాజకీయనేతల నుంచి పలువురు వీఐపీల వరకు కోరుతుండటంతో అధికారులు సైతం వాటికే ప్రాధాన్యమిస్తున్నారు.  వివిధ వర్గాల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లోనూ వీటిని కోరుతున్నవారే ఎక్కువగా ఉన్నారు.  దోమల వల్ల వచ్చే మలేరియా, తదితరమైన వ్యాధులు నయమవుతాయి కానీ.. కరోనా వస్తే ప్రాణాంతకమనే తలంపుతోనూ చాలామంది హైపోక్లోరైట్‌నే కోరుతున్నారు. ఉన్న సిబ్బందిని ఆ కార్యక్రమాలకు వినియోగించాల్సి వస్తోంది.  ఈ నేపథ్యంలో ఎంటమాలజీ విభాగం సైతం రెగ్యులర్‌గా నిర్వహించే  దోమల నివారణ చర్యల్ని మానుకుంది. దీంతో స్లమ్స్‌తో పాటు పలు కాలనీలు, నివాస ప్రాంతాల్లోనూ దోమలు క్రమేపీ పెరగుతున్నాయి. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే ఇవి మరింత తీవ్రమయ్యే ప్రమాదమున్నందున  దోమల నివారణపై కూడా అధికారులు ద్రుష్టి సారించాలని పలు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. మరోవైపు హైపోక్లోరైట్‌ స్ప్రే కూడా అన్ని ప్రాంతాల్లోనూ జరగడం లేదని, పరిమిత ప్రాంతాల్లోనే జరుగుతోందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు