ప్యారడైజ్‌ హోటల్‌కు లక్ష జరిమానా

18 Oct, 2019 10:20 IST|Sakshi

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ హోటల్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. బిర్యానీకి జాతీయ స్థాయిలో పేరున్న ఈ హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన కూరగాయలు కనిపించడంతో అధికారులు ఈ జరిమానా విదించారు. గురువారం హోటల్‌కు వచ్చిన ఓ వినియోగదారులు బిర్యానీలో వెంట్రుకలు కనిపించడంతో సిబ్బందిని నిలదీశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ సుదర్శన్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్, వెటర్నరీ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డిలు హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ క్యారీబాగులు కనిపించాయి. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు వినియోగిస్తుండటం కిచన్‌లో అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. దీంతో అధికారులు హోటల్‌ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు జారీ చేసి లక్ష రూపాయల జరిమానా విధించారు. మరోమారు ఇలాగే ఉంటే హోటల్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

ప్యారడైజ్‌ హోటల్‌లో తనిఖీలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు

జమ్‌జమ్‌ బేకరీకిరూ.15వేల జరిమానా
ప్యారడైజ్‌ సర్కిల్‌లో ఉండే జంజం బేకరీకి రూ.15వేల జరిమానా విదించారు. ఈ బేకరిలో కూడా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడుతుండటం, కిచన్‌లో అపరిశుభ్రత కనిపించడంతో నోటీసులు జారీ చేసి జరిమానా విధించారు.

జమ్‌జమ్‌ బేకరికి జరిమానా విధిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు

మరిన్ని వార్తలు