ఊపందుకున్న ప్రచారం

14 Nov, 2018 12:11 IST|Sakshi

 మహాకూటమి అభ్యర్థి  ప్రకటనతో ప్రచార వేగం పెంచిన ప్రధాన పార్టీలు

 నామినేషన్‌ వేసిన బీజేపీ అభ్యర్థి 

గోదావరిఖని: మహాకూటమి టికెట్‌ కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించడంతో రామగుండం నియోజకవర్గంలో మంగళవారం నుంచి ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు కేటాచయించగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ను ఖరారు చేశారు. బీజేపీ నుంచి బల్మూరి వనితను ఖరారు చేయగా ఇప్పటికే ఒక సెట్టు నామినేషన్‌ వేశారు. అదేవిధంగా బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా సీపీఎంకు చెందిన బుర్ర తిరుపతిగౌడ్‌ తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 

అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థిగా కోరుకంటి చందర్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మహాకూటమి అభ్యర్థి కేటాయింపు వరకు స్థబ్ధుగా ఉన్న ప్రచారం నియోజకవర్గంలో ఒక్కసారిగా ఊపందుకుంది. ఆయా పార్టీల అభ్యర్థులు, అనుబంధ సంఘాల నాయకులు, కుల సంఘాలు, సామాజిక వర్గాల వారీగా తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రెండు నెలల ముందు నుంచి అన్ని కుల సంఘాలు, పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అసోసియేషన్లు, ఉద్యోగ సంఘాలు, సీనియర్‌ సిటిజన్లతో ఇది వరకే ఒక దఫాగా సమావేశాలు పూర్తి చేశారు. 

అంతేకాకుండా అన్ని ప్రాంతాల్లో ధూంధాంలు నిర్వహించి పార్టీ విధి విధానాలను వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి కోరుకంటి చందర్‌ కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని అన్ని ఏరియాలతో పాటు మండలాల్లోని గ్రామాల్లో పర్యటించి తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి గా ప్రచారం నిర్వహిస్తున్న కందుల సంధ్యారాణి అన్ని ప్రాంతాలు గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తూ ఆడబిడ్డగా అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగిన పెద్దంపేట్‌ శంకర్‌ తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.  

ప్రచారం ముమ్మరం చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి.. 
మహాకూటమి పార్టీ టికెట్‌ను రాజ్‌ఠాకూర్‌మక్కాన్‌ సింగ్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం నుంచి ప్రచారం ముమ్మరం చేశారు. మక్కాన్‌సింగ్‌కు టికెట్‌ కేటాయించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్‌ అనుబంధ సంఘాలను కలవడంతో టీజేఎస్‌ పార్టీ, సీపీఐ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల్లో మహాకూటమి గెలిపించాలని కోరారు.     

మరిన్ని వార్తలు