ప్రజాకూటమిదే విజయం...: జీవన్‌రెడ్డి

5 Dec, 2018 16:05 IST|Sakshi

జగిత్యాల అభివృద్ధిని అడ్డుకున్నరు

యావర్‌రోడ్డు విస్తరణ ఫైలు తొక్కిపెట్టిండ్రు

 నేను ప్రతిపాదించిన పనులన్నీ తమవే అంటుండ్రు

జనమే నా బలం.. బలగం.

గెలిచినా ఓడినా వారితోనే ఉంటా..

'సాక్షి'తో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్‌రెడ్డి

ప్రతిపక్ష శాసనసభ్యుడిగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డ. నా కృషితో ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి జరిగినా టీఆర్‌ఎస్‌ నాయకులు దాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్‌ తొలిసారిగా కరీంనగర్‌కు వచ్చినప్పుడు నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన బోర్నపల్లి బ్రిడ్జి పనుల అంచనాలు రూపొందించుకుని నిర్మాణం చేపట్టాలని విన్నవించిన. ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్‌ వెంటనే మంజూరు చేసిండు. ఇప్పుడు ఆ బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్‌ అంతా మాదేనని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. నేను ప్రతిపాదించిన ఇలాంటివి మరెన్నో పనులనూ టీఆర్‌ఎస్‌ నేతలు తామే చేశామని ప్రచారం చేయడం ఆవేదన కలిగిస్తోంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేనునందునే సీఎం కేసీఆర్‌ తన వద్ద ఉంచుకున్న రూ.2వేల కోట్ల వరకు రాష్ట్ర అభివృద్ధి నిధుల నుంచి నయాపైసా జగిత్యాలకు ఇవ్వలేదు. అదే మానకొండూరు, వేములవాడ ఇతర నియోజకవర్గాలకు నిధులిచ్చారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. జనమే నా బలం.. బలగం. వాళ్ల ఆశీర్వాదంతో నేను మళ్లీ గెలవబోతున్న. ఓడినా వారి వెన్నంటే ఉంటా. రాష్ట్రంలోనూ ప్రజాకూటమిదే విజయం..’ అన్నారు కాంగ్రెస్‌ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి. ఎన్నికల ప్రచారతీరు.. గెలుపు అవకాశాలు.. నాలుగేళ్ల పాలన విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

సాక్షి, జగిత్యాల : నేను ప్రజల మనిషిని. నిత్యం అందుబాటులో ఉంటున్న.. రాజకీయాలకతీతంగా నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను వింటా. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తున్న. నేను ప్రతిపక్షంలో ఉన్నా నా నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్న. నిరుపేదల సంక్షేమాన్ని కాంక్షించేలా ప్రజాకూటమి రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోపై అన్నివర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అన్నింటికంటే మించి నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతే నన్ను గెలిపిస్తుంది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిన వ్యక్తికే ప్రజల్లో సానుభూతి ఉంటుంది. కానీ.. ఇక్కడ దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో నేను గెలిచినా ఎంపీ కవిత, ఇతర ప్రజాప్రతినిధులు ప్రస్తుత నా ప్రత్యర్థి సంజయ్‌కుమార్‌నే ఎమ్మెల్యేగా పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా బహిరంగ సభల్లోనూ పదే పదే చెప్పడం నన్ను బాధించింది. నేను ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి నన్ను గెలిపించుకుంటామని చెబుతున్నరు.
 
ఆ ఫైలును తొక్కిపెట్టారు..!
ఈ ఎన్నికల్లో యావర్‌రోడ్డు సమస్య అన్ని పార్టీలకు ప్రధాన ఎజెండా మారింది. మాస్టర్‌ ప్లాన్‌ అమలులో భాగంగా గతంలో 60ఫీట్లకు ఆమోదం పొందిన యావర్‌రోడ్డు విస్తరణ.. 40ఫీట్లకు పరిమితమైంది. జగిత్యాల ఇప్పుడు జిల్లాకేంద్రం అయింది. ఆ రోడ్డు వంద ఫీట్లకు విస్తరించబడాలి. దీనికి సంబంధించి తీర్మానం చేసిన జగిత్యాల మున్సిపల్‌ కౌన్సిల్‌ గతేడాది జూన్‌ 31న ఈ ప్రతిపాదనను హైదరాబాద్‌లోని ‘డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లాన్‌’కు పంపింది. అక్కడ ఆ ఫైలును తొక్కిపెట్టారు. దీనికి సంబంధించిన లేఖ ఇప్పటికీ మా దగ్గర ఉంది. యావర్‌రోడ్డు విస్తరణకు కాంగ్రెస్‌ పార్టీ, జగిత్యాల కౌన్సిల్‌ కట్టుబడి ఉంది. 2009లో మేం (కాంగ్రెస్‌) అధికారంలో ఉన్నప్పుడు నూకపల్లిలో 4వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూసేకరణ చేసి.. ఒక్కో ఇంటికి రూ.లక్షతో పనులు మొదలుపెట్టినం. ప్రభుత్వం మారడంతో వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. మరో రూ.లక్ష కేటాయిస్తే వాటి నిర్మాణాలు పూర్తయ్యేవి.

అవి పూర్తి చేస్తే నాకు పేరొస్తుందనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని పక్కనబెట్టింది. అదే ప్రాంతంలో కొత్తగా 4వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. దీనికి టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. నాలుగేళ్ల పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చని టీఆర్‌ఎన్‌ పార్టీని అన్నివర్గాలు.. పార్టీలు చీదరించుకుంటున్నాయి. నీళ్లు.. నిధులు.. నియామకాల విషయంలో జరిగిన అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నించేందుకు.. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ, నియంతృత్వ పాలనను తుది ముట్టించేందుకు.. నాడు ఉద్యమంలో పాల్గొన్న పార్టీలు, ముఖ్యులందరూ ప్రజాకూటమిగా ఏర్పడ్డారు. 

ఇది నేను చేసింది కాదా..?
30 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పనులు చేపట్టిన. అవి టీఆర్‌ఎస్‌ నేతలకు కనిపించినా.. చూడనట్లు మాట్లాడుతున్నరు. నేను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేసిన.. అది భవిష్యత్తులో యూనివర్సిటీగా రూపుదిద్దుకోబోతుంది. పొలాసలోని వ్యవసాయ డిగ్రీ కాలేజీ, నిరుద్యోగ యువతకు సంబంధించిన నాక్‌ శిక్షణ కేంద్రం, పీజీ కాలేజీలు తెచ్చింది నేను కాదా..? జగిత్యాల జిల్లాగా రూపుదిద్దుకున్న క్రమంలో ఇక్కడ ఓ మెడికల్‌ కాలేజీ అవసరమైంది. ఇప్పుడు నా దృష్టి మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై ఉంది. చల్‌గల్‌లో మామిడి మార్కెట్‌ ఏర్పాటు చేసుకుని జగిత్యాలలో కోర్టు భవనం నిర్మించుకున్నం. గోదావరి నదిపై రూ.40 కోట్లతో కమ్మునూరు – కలమడుగుపై వంతెన మంజూరు చేయించిన. వాటి పనులు పూర్తయ్యాయి. నా నియోజకవర్గంలో బీటీ రోడ్డు లేని గ్రామాలు లేనేలేవు. పట్టణ విషయానికి వస్తే అంతర్గత, బహిర్గత బైపాస్‌ రోడ్ల నిర్మాణాలు చేపట్టిన. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి.. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ అభివృద్ధి ఆ పార్టీ నేతలు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేడ్‌ 1 ఉన్న జగిత్యాల మున్సిపాలిటీకి రూ.50కోట్లు కేటాయించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇటు గ్రేడ్‌–2, గ్రేడ్‌ –3 మున్సిపాలిటీలు అయిన కోరుట్ల, మెట్‌పల్లిలకూ అవే నిధులు కేటాయించారు. ఇందులో జగిత్యాల పట్టణానికి ప్రత్యేకంగా చేసిందేమిటో వారికే తెలియాలి.

వీటిని ఎందుకు పరిష్కరించలేకపోయారు..?
గత విద్యాసంవత్సరం రాయికల్‌లో డిగ్రీ కాలేజీ ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం మంజూరైంది. కానీ బోధన, బోధనేతర సిబ్బంది నియామకం లేక ప్రారంభంకాలేదు. సీఎం పర్యటన నేపథ్యంలో రాయికల్‌ మండలం బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్‌ మధ్య వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ కవిత ప్రకటించారు. ఇంతవరకు దాని నిర్మాణ పనులకు పరిపాలన అనుమతి రాలేదు. రాయికల్‌లో మ్యాంగో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చి నెరవేర్చలేదు. సారంగాపూర్‌లో 0.25నీటి సామర్థ్యం ఉన్న రోళ్లవాగు ప్రాజెక్టును టీఎంసీకి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఆధునీకరణ పనులు నత్తకునడక నేర్పుతున్నాయి. రాయికల్‌ మండలం మూటపల్లి–భూపతిపూర్‌లో పంచాయతీ రాజ్‌ శాఖకు చెందిన రోడ్డు ధ్వంసమై నాలుగేళ్లవుతున్నా.. రెన్యువల్‌ చేయలేదు. బీటి రోడ్డు కూడా వేయించలేకపోయారు. ఇప్పుడు టెండర్, అగ్రిమెంట్, అంచనాలు లేకుండా ఎన్నికల కోడ్‌ అని కూడా చూడకుండా బినామీతో పనులు ప్రారంభించాలని చూస్తే కోర్టు పనులు ఆపేసింది. ఐదు నెలల క్రితం జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో రూ.8 కోట్లతో విత్తనశుద్ధి కేంద్రం ఏర్పాటు పనులకు భూమిపూజ చేసిండ్రు.. ఆ పనులకు సంబంధించి ఇప్పటికీ టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయలేదు.   

>
మరిన్ని వార్తలు