గుడుంబా రహిత రాష్ట్రంగా తెలంగాణ

26 Apr, 2016 03:33 IST|Sakshi
మద్యంలో కల్తీ గుర్తించే హైడ్రోమీటర్‌ను పరీక్షిస్తున్న మంత్రి పద్మారావు

మంత్రి పద్మారావు  కల్తీ కల్లు నియంత్రణ మిషన్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని త్వరలోనే గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి పద్మారావు తెలిపారు. కల్తీ కల్లు నియంత్రణ యంత్రాన్ని సచివాలయంలో సోమవారం ఆయన ప్రారంభించారు. కల్తీ కల్లు మరణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగానే కల్తీ కల్లు నియంత్రణ యంత్రాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ యంత్రంతో కల్తీ కల్లును నిమిషాల్లోనే గుర్తించగలమన్నారు. మద్యంలో నీళ్లు కలిపి సీల్ వేసి అమ్ముతున్న సంఘటనలను అరికట్టేందుకు హైడ్రోమీటర్‌ను ప్రారంభించారు.

ఈ మీటర్‌ను మద్యంలో వేస్తే ఎంతమేరకు నీళ్లు కలిపారో వెంటనే తెలిసిపోతుందని నిపుణులు వివరించారు. రాష్ట్రంలో కల్తీ కల్లు అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెంటనే ఈ యంత్రాలను పంపి దాడులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో అవినీతికి చోటులేకుండా పనిచేస్తున్న అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ధూల్‌పేటలో గుడుంబా దాడుల కోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నట్లు పేర్కొన్నారు. గుడుంబా తయారీ నుంచి బయటపడ్డవారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ డెరైక్టర్ అకున్ సబర్వాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రసదన్ తదితరులు పాల్గొన్నారు. 

 

 

మరిన్ని వార్తలు