పంచాయతీకి ‘ఉపాధి’ అనుసంధానం

14 Jun, 2019 10:32 IST|Sakshi

నల్లగొండ : గ్రామపంచాయతీలకు ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేయనున్నారు. కూలీలకు వంద రోజులు తప్పనిసరిగా పనులు కల్పించాలన్న ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు గ్రామపంచాయతీలకు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల పనుల్లో మరింత జవాబు దారీతనం పెరిగే అవకాశం ఉంది. గ్రామాలకు అవసరమైన పనులనే గ్రామ సర్పంచ్, కార్యదర్శుల తీర్మానాల మేరకు చేపట్టి గ్రామాభివృద్ధికి బాటలు వేయనున్నారు. ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పిస్తారు.  ఉపాధి హామీ పథకం పనులను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామాల్లో జరిగే ఉపాధి పనులను గ్రామ పంచాయతీల పర్యవేక్షణలోనే చేపట్టాలని నిర్ణయించింది.

దీనిని ప్రస్తుతం డీఆర్‌డీఏ పరిధిలోని సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. పనులపై పెద్దగా పంచాయతీలకు పర్యవేక్షణ ఉండడం లేదు. దాంతో జవాబుదారీతనం లేకపోవడం వల్ల చేపట్టే వాటితో ఇటు  గ్రామపంచాయతీకి ఉపయోగపడకపోనూ, కూలీలకు కూడా వంద రోజులు పని కల్పించలేని పరిస్థితి నెలకొంది. అయితే క్షే త్రస్థాయిలోని గ్రామ పంచాయతీ సహాయకులు, ఇటు గ్రామ కా ర్యదర్శులను కూడా భాగస్వాములను చేసే విధంగా గ్రా మీ ణా భివృద్ధి శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం గ్రామాల్లో వన నర్సరీలు ఇప్పటికే చేపడుతున్నారు. ఐదో విడత హరితహారం కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నారు. వీటికి తోడు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ పనులను కూడా వారికే అప్పగిస్తే బాగుంటుందనేది వారి ఉద్దేశం.

వంద రోజుల పని తప్పనిసరి 
గ్రామాల్లో నమోదు చేసుకున్న కూలీకి వంద రోజుల పని తప్పనిసరి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో ఎవరు కూలీలు అనేది పంచాయతీ పాలకవర్గానికి కచ్చితంగా తెలుస్తుంది. దాంతో ఎవరికైతే వంద రోజులు పని రాదో వారిని గుర్తించి కల్పించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

పంచాయతీ పాలక వర్గం, కార్యదర్శి పర్యవేక్షణలోనే పనులు
డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరిగే ఉపాధి హామీ పనులన్నీ పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శి పర్యవేక్షణలో చేపట్టనున్నారు. పనుల గుర్తింపుతో పాటు పనుల నిర్వహణలో కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. దీనికి తోడు వచ్చే ఫిర్యాదులను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది.

ఇప్పటికే నూతన కార్యదర్శుల నియామకం
పంచాయతీలో ఇప్పటికే నూతన కార్యదర్శుల నియామకం ప్రభుత్వం చేపట్టింది. వారికే ఉపాధి పనుల అదనపు బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. ఇక పంచాయతీలకు అవసరమైన పనులను సర్పంచ్, కార్యదర్శులు ఆ గ్రామాభివృద్ధికి వాటిని గుర్తించి చేపట్టుకునేందుకు కూడా ఆస్కారం ఉంది.

గ్రామాల అభివృద్ధికి మరింత అవకాశం 
పంచాయతీలకు ఉపాధి పనులు అనుసంధానం చేయడం వల్ల మరింత అభివృద్ధి పనులు జరగనున్నాయి. సర్పంచులు ప్రత్యేక దృష్టిని సారిస్తే కోట్లాది రూపాయల విలువ చేసే పనులు గ్రామాల్లో చేపట్టే అవకాశం ఉంది. పారిశుద్ధ్య పనులకు సంబంధించి డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి పంచాయతీ నిధులు కాకుండా ఉపాధి నిధులను వాడవచ్చు. చెత్తను తరలించడం ద్వారా కూలీలకు నిత్యం పని కల్పించే అవకాశం  ఉంది. ఈ నిధులతోనే  వైకుంఠదామాలు నిర్మించుకునేందుకు కూడా అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రతి ఇంట్లో భూగర్భజలాలు పెరిగేందుకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టేందుకు ఉపాధి పథకం ద్వారా రూ. 4వేలు ఇవ్వనుంది. స్వచ్ఛభారత్‌ కా>ర్యక్రమాలు, మరుగుదొడ్లు, పశువులకు నీటితొట్లు, వర్మికంపోస్టు తదితర వాటిని చేపట్టేందుకు ఎంతో అవకాశం ఉంటుంది.

గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి
ఉపాధి హామీ పనులు పంచాయతీలకు అనుసంధానం చేయడం వల్ల గ్రామాల్లో ఏయే పనులు అవసరమో గుర్తించడంతోపాటు అత్యవసరమైనవాటికి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. పనుల గుర్తింపు పంచాయతీల పరిధిలోనే జరుగుతుండడం వల్ల ఆ గ్రామంలో ఏది అవసరమో వారికి తెలుస్తుంది. తద్వారా గ్రామంలో ప్రజలకు  అత్యవసరమైన పనులను వెంటనే చేసుకునే అవకాశం ఉంటుంది. ఫీల్డ్‌ అసిస్టెంట్లు కూడా గ్రామ పంచాయతీ భవనంలోనే ఉంటారు. తద్వారా అంతా కలిసి గ్రామాభివృద్ధికి బాటలు వేసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.    –  డీపీఓ విష్ణువర్థన్‌ రెడ్డి  

మరిన్ని వార్తలు