అధిక పరిహారం మంజూరు చేయొచ్చు

21 Jun, 2015 01:47 IST|Sakshi

హైకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహనాల చట్టం కింద బాధితులు కోరే పరిహారం కన్నా అధిక పరిహారాన్ని మంజూరు చేసే అధికారం కోర్టులకు, ట్రిబ్యునళ్లకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు ఆర్.సుభాష్‌రెడ్డి, కె.సి.భాను, నూతి రామ్మోహనరావు, పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన విస్తృత ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

ఈ అంశంపై పడిగాల లింగారెడ్డి వర్సెస్ సట్ల శ్రీనివాస్ కేసులో జస్టిస్ మోతీలాల్ బి.నాయక్, జస్టిస్ రోహిణిలతో కూడిన ధర్మాసనం 2001లో తీర్పునిచ్చింది. ఈ తీర్పునకు పూర్తి విరుద్ధంగా, 2002 జనవరిలో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ చింతల అలియాస్ ఎ.నర్సింహ కేసులో జస్టిస్ బి.ఎస్.ఎ.స్వామి, జస్టిస్ డి.ఎస్.ఆర్.వర్మలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. దీంతో ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు విస్తృత ధర్మాసనం ఏర్పాటైంది.

2002, 2013, 2014, 2015లలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విస్తృత ధర్మాసనం.. తాజా తీర్పు వెలువరించింది. గతంలో జస్టిస్ బి.ఎస్.ఎ. స్వామి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.

మరిన్ని వార్తలు