సాహితీ పరిమళం.. సౌ'భాగ్య' ఆతిథ్యం

24 Jan, 2019 02:18 IST|Sakshi

ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌ సాహిత్యోత్సవం 

అతిథి దేశంగా చైనా, భారతీయ భాషగా గుజరాతీ సాహిత్యం 

వివిధ దేశాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు  

మూడు రోజుల పాటు విభిన్న అంశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు 

సాక్షి, హైదరాబాద్‌: విభిన్న కళలు, సాహిత్యం, సంస్కృతుల్ని ఒక వేదికపైకి తెచ్చే హైదరాబాద్‌ సాంస్కృతిక ఉత్సవం (హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌)కు రాజధాని ముస్తాబైంది. బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఈ నెల 25 నుంచి 27 వరకు జరగనున్న ఈ వేడుకలకు ఇప్పటికే హెచ్‌ఎల్‌ఎఫ్‌ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ తొమ్మిదో ఎడిషన్‌ వేడుకలకు చైనా అతిథి దేశంగా హాజరుకానుండగా..గుజరాతీ భాషా సాహిత్యాన్ని ఈ ఏడాది భారతీయ భాషగా ఎంపిక చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు కూడా ఈ ఏడాది కావడంతో ఆయన తత్వ్త చింతన, సిద్ధాంతాలు, ఆయనపై రూపొందిన సినిమాలపై ఈ వేడుకల్లో చర్చలు, సదస్సులు జరగనున్నాయి.  

పెద్దనోట్ల రద్దు, ఆధార్‌ గుర్తింపు, ‘మీ టూ’ఉద్యమం, సమాజంలోని వివిధ వర్గాల్లో నెలకొన్న ఆందోళనలు, తదితర అంశాలపైన ఈ వేడుకల్లో లోతైన చర్చలు జరగనున్నాయి. చైనా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మందికి పైగా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. మొత్తం మూడు వేదికలపైన 30 వర్క్‌షాపులు నిర్వహిస్తారు.  

‘కావ్యధార’కు శ్రీకారం 
ఈ ఏడాది హైదరాబాద్‌ సాహిత్యోత్సవంలో సరికొత్తగా ‘కావ్యధార’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కావ్యధారలో ప్రతిరోజూ 12 గంటల పాటు నిరంతర కవితా పఠనం ఉంటుంది. ఈ కవి సమ్మేళనంలో తమ కవిత్వాన్ని చదవడమే కాకుండా దానికి వివిధ కళారూపాలను జోడించి ప్రదర్శించడం ఈ కావ్యధార ప్రత్యేకత. 

భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషలకు చెందిన కవులు ఈ వేదికను పంచుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో వెలువడిన కవిత్వానికి సైతం ఇక్కడ చోటు ఉంటుంది. ఈ కావ్యధారలో ఆచార్య ఎన్‌.గోపీ, ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ, యాఖూబ్, షబానా ఆజ్మీ, మంగళాభట్, రాజ్‌రావు, ఈల అరుణ్, చైనా రచయిత బైటా తదితరులు పాల్గొంటారు. అలాగే ‘జోష్‌ – జోష్‌–ఇ–హైదరాబాద్‌’పేరుతో దక్కనీ, హిందూస్తానీ కవిత్వ ప్రదర్శనతో పాటుగా లక్నోకు చెందిన కళాకారుల గ్రూపు ‘లక్నవీ కల్చర్‌’పై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది.  

‘మీ టూ’, గాంధీయిజంపై చర్చలు... 
గత ఏడాది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ‘మీ టూ’ఉద్యమంపై హెచ్‌ఎల్‌ఎఫ్‌లో మరోసారి చర్చ జరగనుంది. వైరముత్తు నుంచి ఎదురైన వేధింపులను బయటపెట్టిన చిన్మయి శ్రీపాద, ఎంజే అక్బర్‌ లైంగిక వేధింపులను బహిర్గతం చేసిన దీదీ’పుస్తక రచయిత, ప్రముఖ జర్నలిస్టు షుతపాపల్, బెంగళూర్‌ లిటరరీ ఫెస్టివల్‌ డైరెక్టర్‌ లైంగిక వేధింపులను బయటి ప్రపంచానికి చెప్పిన సంధ్య మీనన్‌లు తమ అనుభవాలను ఆవిష్కరించనున్నారు. ‘గాంధీ ఇంపాజిబుల్‌–పాజిబిలిటీ’, ‘ది మహాత్మా అండ్‌ మూవీస్‌’పై పలువురు ప్రముఖులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు పాల్గొని ప్రసంగిస్తారు. గుజరాతీ సాహిత్యంపై గాంధీ ప్రభావం అనే అంశంపైన చర్చ ఉంటుంది. ప్రముఖ రచయిత సుధీర చంద్ర, నిర్మాత సురేశ్‌ జిందేల్, గోవింద్‌ నిహ్లానీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ‘పెద్దనోట్ల రద్దు’పై చాల్స్‌ ఎస్సెస్సీ, రామ్మనోహర్‌రెడ్డి (ఈపీడబ్ల్యూ) ప్రసంగిస్తారు. ‘ది ఆధార్‌ స్టోరీ’పైన చాల్స్‌ ఎస్సెస్సీ, కళలు, కళాకారులు, రచయితలు, మేధావులు, తదితర వర్గాలపైన కొనసాగుతున్న దాడులు, వివిధ వర్గాల్లోంచి వస్తోన్న ఆందోళనలపైన నిఖిలా హెన్సీ (హిందూ), రష్మీ సక్సేనా, తదితరులు ప్రసంగిస్తారు.  

ముస్కాన్‌కు సన్మానం 
హెచ్‌ఎల్‌ఎఫ్, ఫుడ్‌ ఫర్‌ థాట్‌ ఆధ్వర్యంలో భోపాల్‌లో ‘బాల పుస్తకాలయ’గ్రంథాలయాన్ని నడిపిస్తున్న 11 ఏళ్ల చిన్నారి ముస్కాన్‌ను ఈ సందర్భంగా సన్మానించనున్నారు. జగర్నాట్‌ పబ్లిషింగ్‌ సంస్థ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఆకాష్‌జోషి రచనకు పుస్తక ప్రచురణ అవకాశం కల్పిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా 12 పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. పదేళ్ల చిన్నారి కృతి మునగాల రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించనుంది. కైఫే ఆజ్మీ, మృణాళిని సారాభాయిల శతజయంతి సందర్భంగా హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ ఘనంగా నివాళులర్పించనుంది. ఈ సందర్భంగా వారిపైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.  

మూడు వేదికలు–ముప్పై వర్క్‌షాపులు 
ఈ వేడుకల్లో మొత్తం మూడు వేదికలను ఏర్పాటు చేస్తారు. ఒక వేదిక ప్రత్యేకంగా కవిత్వం కో సం కేటాయించగా మిగతా రెండు వేదికలపైన చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. ఈ మూడు రోజుల్లో 30 వర్క్‌షాపులను నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ ‘సాక్షి’తో చె ప్పారు. మట్టి వస్తువుల తయారీ, స్టోరీ టెల్లింగ్, హౌ టూ రైట్‌ ఏ ఫిల్మ్, క్విజ్‌ పోటీలు, సినిమా దర్శకత్వంపై చర్చలు, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.  

చైనా నుంచి ఎనిమిది మంది రచయితలు 
- అతిథి దేశంగా పాల్గొంటున్న చైనా నుంచి 8 మంది రచయితలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. చైనాకు చెందిన ప్రముఖ రచయిత ఎలాయ్‌ సమకాలీన చైనా సాహిత్యంపై ప్రసంగిస్తారు.  
చైనా సాంస్కృతిక, కళారూపాలను ప్రదర్శిస్తారు.  
మొదటి రోజు ప్రారంభోత్సవంలో గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత సితాన్షు యశస్‌చంద్ర కీలకోపన్యాసం చేస్తారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొంటారు.  

మరిన్ని వార్తలు