సివీక్‌..సెన్స్‌!

30 Mar, 2020 09:39 IST|Sakshi

సండే మార్కెట్లకు గుంపులుగా చేరుకున్న సిటీజనులు

కనిపించని మాస్కులు, శానిటైజర్లు

మార్కెట్ల తరలింపుఆలస్యంపై ఆందోళన

వైరస్‌ మూడో దశ నేపథ్యంలో అప్రమత్తత అవసరమంటున్న నిపుణులు

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌–19 కలకలం నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ...గ్రేటర్‌ పరిధిలో కొంతమంది ప్రజలు ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ‘సివిక్‌ సెన్స్‌’ లేనట్టుగానే నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఆదివారం కావడంతో నగరంలో పలు చోట్ల పండ్లు, కూరగాయలు, మటన్, చికెన్‌ మార్కెట్లకు ఎప్పటిలాగే పెద్ద ఎత్తున జనం వెల్లువెత్తారు. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలంటూ ప్రభుత్వ వర్గాలు, పోలీసులు, మీడియా, వైద్యులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ జనం పెడచెవిన పెడుతున్నారు. పలు చోట్ల శానిటైజర్లు, మాస్క్‌లు కరువయ్యాయి. నగరంలో  రైతుబజార్లు, మార్కెట్లను జనం రద్దీ లేకుండా విశాలమైన ప్రాంగణాలకు తరలించడం ఆలస్యమవుతుండడంతో పలు మార్కెట్ల వద్ద రద్దీ అనివార్యమౌతోందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

నగరంలోని 11 రైతుబజార్లతోపాటు బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, మాదన్నపేట్‌ మార్కెట్ల నుంచి మొబైల్‌ వాహనాల ద్వారా నగర వ్యాప్తంగా పలు డివిజన్లకు కూరగాయలను సరఫరా చేస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. చికెన్, గుడ్ల వినియోగంపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పారదోలుతూ.. ఇవి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల బహిరంగ ప్రకటన చేయడంతో ఆదివారం పలు చికెన్‌ సెంటర్లు, మార్కెట్లు  కిటకిటలాడాయి. గుడ్లకు సైతం డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. నగరంలో ప్రధాన రహదారులు మినహా పలు ప్రధాన వీధుల్లోనూ జనం గుంపులుగా సంచరించడం కనిపించింది. నిత్యావసరాల సాకుతో పలువురు మూడు కిలోమీటర్ల దూరం నిబంధనను ఉల్లంఘంచి అధిక దూరాలకు ద్విచక్రవాహనాలు, కార్లలో సంచరించారు. కాగా కరోనా వ్యాప్తి మూడోదశకు చేరుకున్న నేపథ్యంలో సిటీజనులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా నగరంలో 150 మొబైల్‌ వాహనాల ద్వారా కూరగాయలు విక్రయించనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. నగరంలో 40 వేల మందికి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

ఇదో ఉదాహరణ మాత్రమే..
పాతబస్తీ మీరాలం మండిలో ఆదివారం లాక్‌డౌన్‌ అస్సలు కనిపించ లేదు. పాతబస్తీలో ప్రధాన కూరగాయల మార్కెటైన మీరాలంమండిలో ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కనిపిస్తుంటుంది. అధిక సంఖ్యలో ఖరీదు చేయడానికి ప్రజలు ఎగబడుతుండడంతో గత వారం రోజులుగా మీరాలంమండిలో ఎటుచూసినా వినియోగదారులే కనిపిస్తున్నారు. సోషల్‌ డిస్టెన్స్‌ ఏమాత్రం పాటించడం లేదు. గుంపులు గుంపులుగా వస్తున్నారు. వీరిని కట్టడి చేయడానికి ఎటవంటి పోలీసు యంత్రాంగం ఇక్కడ అందుబాటులో లేదు. మరోవైపు మీరాలంమండి మర్చంట్స్‌ దుకాణాలు కూడా జనం రద్దీతో కిటకిటలాడుతున్నాయి.  ట్రాఫిక్‌ జాం సమస్యలు తలెత్తాయి. నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌ తదితర మార్కెట్లలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది.

మరిన్ని వార్తలు