కరోనాపై వైద్యనిపుణులతో నాట్స్ వెబినార్

30 Mar, 2020 09:41 IST|Sakshi

టాంప(ఫ్లోరిడా) : అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నడుంబిగించింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు కావడంతో నాట్స్ అప్రమత్తమైంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై నాట్స్ వైద్య నిపుణులతో వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు కె.వి. సుందరేశ్, డాక్టర్ మధు కొర్రపాటి  కొవిడ్-19 పై ఎంత  అప్రమత్తంగా ఉండాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాకుండా ఉంటుందనే దానిపై అవగాహన కల్పించారు. అంతే కాకుండా కరోనా పేషంట్లలో ప్రధానంగా తలెత్తుతున్న సమస్యలు ఏమిటి..? ఎలాంటి వారు మరణానికి దగ్గరవుతున్నారు..? అనే విషయాలపై కూడా వైద్య నిపుణులు తమ అనుభవాలను ఈ వెబినార్ లో పంచుకున్నారు. ఏ మాత్రం జాగ్రత్తగా లేకున్నా ఈ మహమ్మారి అమెరికాలో పది లక్షల మందికిపైగా వచ్చే అవకాశముందని హెచ్చరించారు. ముఖ్యంగా శ్వాసకోశ  సమస్యలు ఉన్నవాళ్లు.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

నిత్యావసరాల కోసం బయటకు వెళ్లినా కూడా శుభ్రంగా చేతులు కడుక్కోనే ఇంట్లోకి రావాలని... పట్టుకునే సంచుల నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వైరస్ ను మన ఇంట్లోకి మోసుకొస్తున్నామా...? అనే విషయాన్ని పదే పదే గుర్తుంచుకుని వ్యహారించాలని హెచ్చరించారు. కోవిడ్ బారిన పడ్డ ఒక తెలుగు బాధితుడు కూడా ఈ వెబినార్ ద్వారా అందరూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను తెలియ చేశారు. దాదాపు 500 మంది తెలుగువారు ఈ వెబినార్ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు. కరోనాపై తమకు ఉన్న సందేహాలను వైద్య నిపుణుల ద్వారా నివృత్తి చేసుకున్నారు. కరోనా వైరస్ విస్తృతమవుతున్న ఈ తరుణంలో సామాజిక దూరం పాటిస్తూ నాట్స్ వెబినార్ నిర్వహిస్తోంది. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, సలహాకమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ మల్లాది, డా. దుర్గారావు పరిమి, టెంపా నాట్స్ కో ఆర్డినేటర్ రాజేశ్  కాండ్రు, సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, సుబ్బా రావు యన్నమని, నాట్స్ గ్లోబల్ టీం నుంచి విష్ణు వీరపనేని తదితరులు ఈ వెబినార్ నిర్వహాణలో తమవంతు సహాయ సహాకారాలు అందించారు. ప్రశాంత్ పిన్నమనేని ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహారించారు. నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి టాంప ఫ్లోరిడా చాప్టర్ చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు