బాలల చిత్రోత్సవాలకు శాశ్వత వేదికగా హైదరాబాద్‌

15 Nov, 2017 02:21 IST|Sakshi
విజేతలకు బహుమతులు అందజేస్తున్న తలసాని

చిత్రోత్సవం ముగింపు వేడుకలో తలసాని శ్రీనివాస్‌  

సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ విభిన్న రకాల సదస్సులు, కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలకు నగరం శాశ్వత వేదికగా మారాలని ఆకాంక్షించారు. బాలల చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం ఇక్కడి శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ... ఈ వేడుకను నిర్వహంచడంలో ప్రభుత్వం విజయవంతమైందని అన్నారు. సాంకేతికంగానూ ఈ సారి వేడుక కొత్త పుంతలు తొక్కిందన్నారు.

విభిన్న దేశాల నుంచి చిత్రోత్సవాలకు ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారని, సినిమాలు తీసిన, నటించిన చిన్నారుల ప్రతిభ అబ్బురపరచిందన్నారు. చదువులో మాత్రమే కాకుండా విద్యార్థులకు ఇష్టమైన రంగాల్లో తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా విభిన్న కేటగిరీల్లో గెలుపొందిన చిత్రాలకు గోల్డెన్‌ ఎలిఫెంట్‌ ట్రోఫీలను అందజేశారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలతో పాటు బాల నటి భజరంగీ భాయీజాన్‌ ఫేం హర్షాలీ మల్హోత్రా పాడిన పాట అలరించింది. ఈ కార్యక్రమంలో సినీ తారలు శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్, చిత్రోత్సవాల చైర్మన్‌ ముకేశ్‌ ఖన్నా, డైరెక్టర్‌ శ్రవణ్‌కుమార్, జ్యూరీ చైర్‌పర్సన్‌ అమల అక్కినేని తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు