అక్కడుండలేక.. ఇక్కడికి రాలేక..

30 Apr, 2020 10:23 IST|Sakshi

ఫ్రాన్స్‌లో హైదరాబాద్‌ విద్యార్థుల ఇక్కట్లు

లాక్‌డౌన్‌లో రూమ్‌కే పరిమితం

ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు

ఆదుకుంటున్న ఫ్రాన్స్‌ తెలుగు అసోసియేషన్‌

సాక్షి, సిటీబ్యూరో: ‘లాక్‌డౌన్‌ కారణంగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు బ్రేక్‌ పడింది. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. ఇబ్బందిగా ఉంది. అన్నింటికీ మించి ఎవరికి వాళ్లం ఒంటరిగా అయిపోయాం. ఈ అనిశ్చితి ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు. చాలా ఆందోళçనగా ఉంది.’ ఫ్రాన్స్‌లో ఉంటున్న తెలుగు విద్యార్థుల ఆవేదన ఇది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఫ్రాన్స్‌లోనూ లక్షకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. నిత్యావసర వస్తువుల కోసం ఏ రోజుకారోజు పోలీసుల నుంచి ఆన్‌లైన్‌లో అనుమతి పత్రాలను తీసుకొని బయటకు వెళ్లాల్సి వస్తోంది.

ఈ క్రమంలో ఫ్రాన్స్‌లో చదువుకుంటున్న హైదరాబాద్‌ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు కూడా కోల్పోవడంతో అక్కడున్న తెలుగు సంఘాలే తమను ఆదుకొంటున్నాయని హైదరాబాద్‌కు చెందిన మనోజ్‌ ’సాక్షి’తో చెప్పారు. లాక్‌డౌన్‌ ఎప్పటి వరకు కొనసాగుతుందనే అంశంపైన స్పష్టత లేకపోవడం, అనిశ్చితి వల్ల చాలామంది విద్యార్థులు ఆందోళçనకు చెందుతున్నట్లు పేర్కొన్నారు. ‘విద్యాసంస్థలు తిరిగి ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియదు.. తిరిగి ఉద్యోగాల్లో చేరతామనే ఆశలు కూడా కనిపించడం లేదు. అలాగని హైదరాబాద్‌కు వచ్చేందుకు అవకాశం లేదు’ అని అశోక్‌ అనే మరో విద్యార్థి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లిన విద్యార్థులు అక్కడ సాఫ్ట్‌వేర్, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఫ్రాన్స్‌తో పాటు లియాన్, తులూస్, రూన్‌ తదితర నగరాల్లో తెలుగు విద్యార్థులు వెయ్యిమందికి పైగా ఉన్నారు.

విద్యార్థులకు ఫ్రాన్స్‌ తెలుగు అసోసియేషన్‌ పంపిణీ చేసిన నిత్యావసర వస్తువులు ఇవే...
తీవ్రమవుతున్న ఆర్థిక ఇబ్బందులు
హైదరాబాద్‌ నుంచి అక్కడికి వెళ్లిన చాలామంది తమ అవసరాల కోసం తల్లిదండ్రులపైన ఆధారపడకుండా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రైవేట్‌ సంస్థలతో పాటు రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లలో ప్రతి రోజు రెండు, మూడు గంటల పాటు పని చేస్తే నెలకు 500 యూరోల వరకు (40 వేల రూపాయలు) లభిస్తాయి. దీంతో వారి ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ. సింగిల్‌బెడ్‌ రూమ్‌ ఇంటి కోసం సుమారు 900 యూరోల వరకు నెల అద్దె చెల్లించవలసి వస్తుంది. అంటే కనీసం రూ.75 వేలు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నలుగురైదుగురు విద్యార్థులు కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఈ భారాన్ని పంచుకుంటున్నారు. ఇలాంటి వారిని పార్ట్‌టైం ఉద్యోగాలు ఆదుకుంటున్నాయి. కానీ కరోనా మహమ్మారి వల్ల అన్ని రంగాలు కుదేలవడంతో దీని ప్రభావం అక్కడుంటున్న తెలుగు విద్యార్థులపైన పడింది. ‘మే 11వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ఇక్కడి ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ లాక్‌డౌన్‌ ఇలాగే కొనసాగితే ఇక్కడ ఉండడం చాలా కష్టం’ అని సచిన్‌ అనే మరో విద్యార్థి  తెలిపారు. 

అండగా ఎఫ్టీఏ...
తెలుగు విద్యార్థులకు ఫ్రాన్స్‌ తెలుగు అసోసియేషన్‌ (ఎఫ్టీఏ) కొంతవరకు అండగా ఉంది. అక్కడ వివిధ ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా సమాచారం సేకరించింది. బియ్యం, గోధుమపిండి, వంటనూనె, బంగాళాదుంపలు తదితర వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తున్నట్లు స్టూడెంట్‌ కో–ఆర్డినేటర్‌ నీల శ్రీనివాస్‌ ’సాక్షి’ తో చెప్పారు. ’సొంత కుటుంబాలతో కలిసి ఉండేందుకు అవకాశం లేకపోవడం, ఇంటికే పరిమితం కావడం వల్ల పలువురు విద్యార్థులు తీవ్ర ఆందోళనకు, డిప్రెషన్‌కు గురవుతున్నారు. అలాంటి వారిలో ధైర్యం, ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఫ్రాన్స్‌ తెలుగు అసోసియేషన్‌ కృషి చేస్తోంది.  

నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తెలుగు విద్యార్థులు, తెలుగు ప్రజల క్షేమ సమాచారాలను తెలుసుకుంటూనే ఉన్నామని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్‌ రావు చెలికాని  చెప్పారు. చాలాకాలం పాటు ఆయన ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ఫ్రాన్స్‌ తెలుగు అసోసియేషన్‌ ఏర్పడి పని చేస్తోంది. ఎఫ్టీఏ ద్వారా విద్యార్థులకు కావలసిన వస్తువులను అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.– డాక్టర్‌ రావు చెలికాని 

మరిన్ని వార్తలు