సీజ్‌ ఐతే.. సినిమానే!

16 Apr, 2020 07:54 IST|Sakshi
ఖాజాగూడలోని ట్రాఫిక్‌ ట్రైయినింగ్‌ ఇనిస్టిట్యూట్‌లోకి చేరిన సీజ్‌డ్‌ వాహనాలు

మీ వాహనం తిరిగి రావాలంటే నిరీక్షించాల్సిందే

మూడు నెలల దాకా బండి చేతికి అందడం కష్టమే

లాక్‌డౌన్‌ ఉల్లంఘనల్లో 35 వేల వాహనాలు జప్తు

గతంలో వివిధ కేసుల్లో సీజ్‌ అయినవి 30వేలపైనే

ఐపీసీ 188 సెక్షన్‌తో జరిమానా, జైలుశిక్షకు అవకాశం

అకారణంగా రోడ్డెక్కొద్దని పోలీసుల హెచ్చరిక

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు పటిష్టంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌లో మీ వాహనం సీజ్‌ అయిందా? అయితే మీరు కొన్ని నెలలు నిరీక్షించాల్సిందే. అకారణంగా రోడ్డెక్కి పోలీసులకు చిక్కిన మీ వాహనం తిరిగి మళ్లీ మీ చేతికి రావాలంటే లాక్‌డౌన్‌ ముగిశాక దాదాపు నెల నుంచి మూడు నెలల వరకు సమయం పడుతుంది. అంతేకాదు.. ఈ లాక్‌డౌన్‌ వేళ ఐపీసీ 188 సెక్షన్‌ (ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమించడం) కింద కేసులు నమోదు  చేసి బండ్లు సీజ్‌ చేస్తున్న వాటిలో వాహనచోదకులకు జైలుశిక్ష పడే అవకాశముందని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఓవైపు వాహనం.. మరోవైపు జైలుశిక్ష.. ఇంకోవైపు నెలల తరబడి ఠాణాలు, న్యాయస్థానాల చుట్టూ చక్కర్లు.. ఇన్ని ప్రయాసలు పడే బదులు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరుతున్నారు.

గుట్టలు గుట్టలుగా..  
నగరంతో పాటు శివారు ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. బైక్‌పై ఒకరికి మించి,  కారులో ఇద్దరికి మించి ఎక్కువ మంది ప్రయాణిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. మరికొందరు సరైన వాహన పత్రాలు లేకుండానే రోడ్డెక్కి పోలీసుల తనిఖీల్లో దొరికిపోతున్నారు. ఫలితంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో 35వేల వాహనాలు సీజ్‌ అయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందు డ్రంకెన్‌ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలు, హత్యలు.. ఇలా వివిధ నేరాల్లో జప్తు చేసిన వాహనాలు కూడా 30వేల వరకు ఉన్నాయి. ఈ వాహనాలే ఆయా ఠాణాల్లో గుట్టలు గుట్టలుగా ఉండడంతో ప్రస్తుత లాక్‌డౌన్‌లో సీజ్‌ చేసిన వాహనాలను కొన్ని ప్రైవేట్‌ ప్రాంతాల్లో పార్క్‌ చేస్తున్నారు. మరికొన్ని వాహనాలను ఖాజాగూడలోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్, కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌ వెనక, మొయినాబాద్‌ పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలోని 20 ఎకరాలతో పాటు అబిడ్స్‌లోని గోషామహల్‌ స్టేడియం, అంబర్‌పేటలోని కార్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పార్క్‌ చేస్తున్నట్టు ఆయా కమిషనరేట్ల ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

వాహనాలు మొరాయిస్తాయి..
లాక్‌డౌన్‌ కాలపరిమితి పెంచడంతో పాటు ఆ తర్వాత ఎప్పుడు ఎత్తేస్తారన్న దానిపై కూడా స్పష్టత లేకపోవడంతో పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలు కండిషన్‌ ఏమిటనేదానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నెలల పాటు బండి స్టార్ట్‌ చేయకుండా పక్కన పెట్టేయడం వల్ల ఆయా వాహనాలు కండిషన్‌ చెడిపోయే పరిస్థితి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత కోర్టు ద్వారా సదరు వాహనాన్ని తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చనే వాదన పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. వీటిని దృష్టిలో ఉంచుకొని నగర, శివారు ప్రాంత ప్రజలు మెలిగితే ఇటు కరోనా నుంచి కాపాడుకోవడంతో పాటు వాహనాలు కూడా సురక్షితంగా ఉంటాయంటున్నారు పోలీసులు. 

లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాతే..  
మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌తో పాటు లాక్‌డౌన్‌ వేళ ఐపీసీ 188 సెక్షన్‌ కింద నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇలా ఈ రెండు చట్టాల కింద కేసులు నమోదుచేసి వాహనాలు సీజ్‌ చేస్తున్నాం. ఎంవీ యాక్ట్‌ కింద కేవలం జరిమానాలే పడితే ఐపీసీ 188 సెక్షన్‌ కింద జైలుశిక్ష పడే అవకాశముంది. దీనికితోడు జప్తు చేసిన వాహనాలు తిరిగి వాహనదారులు తీసుకోవాలంటే రెండు నుంచి మూడు నెలల వరకు నిరీక్షించాలి. అది కూడా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాతే. ఇలా అకారణంగా రోడ్డెక్కే బదులు ఇంట్లోనే ఉండి కరోనాపై పోరాడితే మంచిది.– విజయ్‌కుమార్, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ

మరిన్ని వార్తలు