హై రిస్క్‌ మహా నగరాలకే..!

4 Apr, 2020 07:53 IST|Sakshi

కోవిడ్‌–19పై జనం మాట

ఐఐటీ హైదరాబాద్, బాంబేల ఆన్‌లైన్‌ సర్వేలో వెల్లడి

అవగాహనలో మెట్రో నగరాలే టాప్‌...

సాక్షి, సిటీబ్యూరో: మహానగరాలకే కోవిడ్‌–19 ముప్పు అత్యధికంగా ఉందని ఆయా నగరాల ప్రజలు భావిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారికే కోవిడ్‌–19పై అవగాహన అత్యధికంగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబేలు సంయుక్తంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వే ఈ అంశాలను తెలిపింది. సుమారు 1900 మంది నెటిజన్ల అభిప్రాయాలను స్వీకరించారు. ఆన్‌లైన్‌లోనేప్రశ్నావళి రూపొందించి ..వారి ప్రయాణం, విజిట్‌ తదితర అంశాలపై వారి అభిప్రాయాలను సేకరించారు. లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్‌ విధించిన తర్వాత పరిస్థితిపై వారి అభిప్రాయాలను సేకరించారు.

అయితే తాము రూపొందించిన ప్రశ్నావళికి టైర్‌–1 నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే మెట్రో సిటీల నుంచి సుమారు 63.6 శాతం మంది స్పందించినట్లు అధ్యయనం పేర్కొంది. ఇక టైర్‌–2 నగరాలు అంటే విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల నుంచి కేవలం 20.6 శాతం మంది స్పందించినట్లు తెలిపింది. ఇక టైర్‌–3 నగరాలు అంటే దేశంలోని పలు జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌ నుంచి కేవలం 15.8 శాతం మంది ప్రతిస్పందించినట్లు పేర్కొంది.

కోవిడ్‌–19 నేపథ్యంలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ప్రజారవాణాను వినియోగించకుండా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకు మహానగరాల సిటీజన్లు ప్రాధాన్యతనిస్తున్నట్లు తమ అధ్యయనం ద్వారా తేటతెల్లమైందని తెలిపింది. ఇక కోవిడ్‌ కలకలం..లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం మెట్రో నగరాల(టైర్‌–1) సిటీజన్లలో 12 శాతం మంది బయటకు వెళ్లేందుకు తమ వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించినట్లు తెలిసింది. ఇక టైర్‌–2 నగరాల్లో వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించిన వారు 9 శాతం మంది ఉన్నట్లు వెల్లడించింది. ఇక టైర్‌–3 నగరాల్లో ఈ శాతం 7 శాతానికే పరిమితమైందని తెలిపింది.

ఇక మొత్తంగా అన్ని నగరాల్లో కలిపి 48 శాతం మంది లాక్‌ డౌన్‌ ప్రకటించిన మార్చి 3వ వారంలో  ఇళ్లకే పరిమితమయ్యామని..అత్యవసరమైతే మినహా బయటకు వెళ్లలేదని తెలిపారు. మరో 28 శాతం మంది తమ పనుల నిమిత్తం బయటకు వెళ్లినట్లు తెలిపారట. మరో 18 శాతం మంది తమ స్వదేశీ,విదేశీ విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు తెలిపారని ఈ అధ్యయనం వెల్లడించింది. కాగా ఈ అధ్యయనాన్ని ఐఐటీ హైదరాబాద్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు దిగ్విజయ్‌ ఎస్‌.పవార్, ప్రతిమా ఛటర్జీ, ముంబయి ఐఐటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి ప్రొఫెసర్లు నాగేంద్ర వెలగ, అంకిత్‌ కుమార్‌ యాదవ్‌లు కలిసి నిర్వహించినట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు