ఓవైపు పెంచుడు.. మరోవైపు నరుకుడు

4 Jul, 2015 03:28 IST|Sakshi
ఓవైపు పెంచుడు.. మరోవైపు నరుకుడు

- ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు
- యథేచ్ఛగా చెట్లు నరికివేత
- సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
- కలప లారీకి నామమాత్రంగా రూ.2 వేలు జరిమానా  
బషీరాబాద్:
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించగా.. మరోవైపు అక్రమార్కులు చెట్లను నరికి సొమ్ముచేసుకుంటున్నారు. సర్కార్ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభిస్తే బషీరాబాద్‌లో రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో అక్రమార్కులు చెట్లను నరికి తరలించారు. అధికారులు మాత్రం నామమాత్రంగా రూ. 2 వేల జరిమానా విధించి కలప లారీని పంపించడం పలు విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. బషీరాబాద్‌లోని ఇందర్‌చెడ్ మార్గంలోని ఈద్గా వెనుకాల ఓ లారీలో కలపను లోడ్ చేస్తున్నారు.

పలు గ్రామాల నుంచి చెట్లను నరికి ట్రాక్టర్‌లలో లారీ వద్దకు తీసుకువచ్చి లోడ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమార్కులు ఈ తతంగం నడిపించినా అధికారులకు తెలియకపోవడం గమనార్హం. బషీరాబాద్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వీఆర్వోలు నామమాత్రంగా రూ.2 వేలు జరిమానా వేసి త్వరగా లోడు తరలించాలని అక్రమార్కులకు సలహా ఇచ్చి వెళ్లడం గమనార్హం. శుక్రవారం ఉదయం మొక్కలు నాటాలని పాఠశాల నుంచి ర్యాలీ తీశామని, మరోవైపు అక్రమార్కులు చెట్లను నరికి తరలించుకుపోతే పట్టించుకునే వారేలేరని విద్యార్థులు అసహనానికి గురయ్యారు.  
 
అధికారులు అండదండలు!  
అక్రమార్కులు అధికారుల అండదండలతోనే చెట్లను నరికి సొమ్ముచేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం ముండల పరిధిలోని పలు గ్రామాల నుంచి లారీల్లో కలప తరలించుకుపోతున్నా ఇటు అటవీశాఖ అధికారులు గాని, అటు రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

అంతరించి పోతున్న అడవి..
మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతం రోజురోజుకూ అంతరించుకుపోతోంది. ఫారెస్టు అధికారులు అడవులను పర్యవేక్షణ మరిచి తాండూరు రేంజ్ కార్యాలయంలోనే ఉంటూ టైమ్‌పాస్ చేస్తున్నారని మండలవాసులు ఆరోపిస్తున్నా రు. గతంలో మైల్వార్, నీళ్లపల్లి గ్రామా ల్లో కొందరు చెట్లను నరికి పొలం చదునుచేసి సాగుచేసుకోవడం.. ఫారెస్టు అధికారుల పనితీరుకు నిదర్శనం.
 
రూ.2వేలు జరిమానా వేశాం
బషీరాబాద్ శివారులో లారీలో కలపను తరలిస్తున్నారనే సమాచారంతో వీఆర్‌ఓలను పంపించాం. రూ. 2 వేల జరిమానా కూడా విధిం చాం. మా అధికారులే దగ్గరుండి కలప లోడ్‌ను పంపించారనే విషయం నా దృష్టికి రాలేదు.  
-భిక్షపతినాయక్, తహసీల్దార్, బషీరాబాద్

మరిన్ని వార్తలు