కరోనాపై ఐఐటీల పోరు

29 Apr, 2020 02:38 IST|Sakshi

18 ఐఐటీల్లో రూ.120 కోట్లతో 218 పరిశోధన ప్రాజెక్టులు

అగ్రస్థానంలో గౌహతి, తర్వాతి స్థానాల్లో మద్రాస్, హైదరాబాద్‌

పీపీఈ, శానిటైజేషన్, చికిత్సపై పరిశోధకుల ప్రధాన దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సంస్థ (ఐఐటీ)లు ముందు వరుసలో ఉన్నాయి. దేశంలోని 18 ఐఐటీలకు చెందిన నిపుణులు 218 పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌ డీ) ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఈ పరిశోధనలు ఏడు కేటగిరీల్లో జరుగుతుండగా వీటిలో కొన్నింటి ఫలితాలు ఇప్పుడిప్పుడే రావడం ప్రారంభమైనట్లు ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. కరోనాపై జరుగుతున్న ఆర్‌అండ్‌డీ ప్రాజెక్టుల్లో ఐఐటీ గౌహతి అగ్రస్థానంలో ఉండగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఆరు ఐఐటీల్లోనే 50 శాతం ప్రాజెక్టులు..
ఈ పరిశోధన ప్రాజెక్టుల్లో సుమారు 50 శాతం మేర ఆరు ఐఐటీల పరిధిలోనే జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం వ్యక్తిగత రక్షణ కిట్లు (పీపీఈ), శానిటైజేషన్, పారిశుధ్యానికి సంబంధించినవే ఉన్నాయి. పరీక్ష కిట్లు, వైద్య ఉపకరణాలు, రోబోలు, డ్రోన్లు, పర్యవేక్షణ, డేటా విశ్లేషణ, వ్యాధి విస్తరణ తీరుతెన్నులు వంటి రంగాల్లోనూ పరిశోధకు లు దృష్టి కేంద్రీకరించారు. ఐఐటీ గౌహతి, మద్రాసులో ఏడు రకాల కేటగిరీల్లో నూ అభివృద్ది, పరిశోధన ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. 

రూ.120 కోట్లతో పరిశోధన, అభివృద్ధి..
అన్ని ఐఐటీల్లో జరుగుతున్న ఆర్‌ అండ్‌ డీ కార్యక్రమాలకు రూ.120 కోట్ల మేర నిధులు సమకూర్చగా, వీటి ఫలితాలు ఏడాదిన్నరలోగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్, ఐఐటీ గోవా వంటి కొత్త ఐఐటీల్లో కూడా ఆర్‌ అండ్‌ డీ కార్యక్రమాలు పురోగతిలో ఉన్నాయి. పీపీఈ సూట్లు, యూవీ ఆధారిత వ్యాధి నిరోధకాలు, డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వ్యాధిని కట్టడి చేయడం వంటి అంశాల్లో పలు పరిష్కారాలను ఇప్పటికే రూపొందించాయి. అయితే వాణిజ్యపరంగా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు