ఈఆర్సీ ముందుకు నీటి పారుదల శాఖ

11 Feb, 2018 02:49 IST|Sakshi
నీటి పారుదల శాఖ

ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ 

చార్జీల తగ్గింపుపై రేపు విచారణ 

సాక్షి, హైదరాబాద్‌: ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) ముందు నీటి పారుదల శాఖ వాదనలు వినిపించనుంది. విద్యుత్‌ చార్జీలపై 12న హైదరాబాద్‌లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. దీనికి నీటి పారుదల శాఖ తరఫున ముంబైకి చెందిన ఇదామ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అడ్వైయిజరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బల్వంత్‌ జోషి హాజరు కానున్నారు. సాగునీటి అవసరాలకు వినియోగించే ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేసే విద్యుత్‌ చార్జీలను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.6.40 నుంచి రూ.4.88లకు తగ్గించాలని కోరనున్నారు. రాష్ట్రంలోని 19 ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా 58.78 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు నిర్వహణలోకి వస్తే 11,495 మెగావాట్ల మేర విద్యుత్‌ అవసరం ఉండనుంది.  

దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి పెరగటంతో.. 
అలీసాగర్, గుత్ఫా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. వీటికి ప్రస్తుతం 1,359 మెగావాట్ల మేర విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. యూనిట్‌కు రూ.6.40పైసల మేర చెల్లిస్తోంది. ప్రస్తుతం ఎత్తిపోతల అవసరాలు పెరిగి ఆర్థిక భారం పడుతుండటం, దేశవ్యాప్తంగా విద్యుత్‌ లభ్యత పెరిగిన నేపథ్యంలో విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిస్కంలు ఇటీవల ఈఆర్సీని కోరాయి. యూనిట్‌కు రూ.1.52పైసల మేర తగ్గింపునకు ఈఆర్సీ సమ్మతిస్తే ఎత్తిపోతల పథకాలపై భారీగా విద్యుత్‌ భారం తగ్గనుంది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రతినిధిగా జోషిని ఈఆర్సీ ముందు వాదనలకు పంపనుంది.   

మరిన్ని వార్తలు