సంక్రాంతికి సై

1 Dec, 2023 00:43 IST|Sakshi

సంక్రాంతి పండగ అంటే సినిమాల పండగ కూడా. పండగ వసూళ్లను దండుకోవడానికి సంక్రాంతి మంచి సమయం. అందుకే ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. 2024 సంక్రాంతి పండగకి మరో నెలకు పైగా సమయం ఉన్నా అప్పుడే ఇండస్ట్రీలో సంక్రాంతి జోష్‌ కనిపిస్తోంది. ఈసారి పండగకి దాదాపు అరడజను స్ట్రయిట్‌ తెలుగు, దాదాపు ఐదు డబ్బింగ్‌ చిత్రాలతో సినిమాల జోరు బాగానే కనిపించనుంది. సినీ లవర్స్‌కి పండగకి దాదాపు పది చిత్రాలు రానున్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. 

► ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) వంటి చిత్రాలతో సంక్రాంతి రేసులో నిలిచి, విజయం అందుకున్నారు నాగార్జున. ‘నా సామి రంగ’ చిత్రంతో ఈసారి మళ్లీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో నాగార్జున ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తారు. ఆయన మాట తీరు, యాక్షన్‌ సీక్వెన్సులు అన్నీ కొత్తగా, స్టైలిష్‌గా ఉంటాయి. నాగార్జున పుట్టిన రోజు (ఆగస్ట్‌ 29) సందర్భంగా విడుదల చేసిన నాగార్జున లుక్, గ్లింప్స్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

‘ఈ పండక్కి నా సామి రంగ’ అంటూ గ్లింప్స్‌ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్‌ వైరల్‌ అవుతోంది. ఆయన కెరీర్‌లో 99వ సినిమాగా ‘నా సామి రంగ’ రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు కానీ, సంక్రాంతికి రిలీజ్‌ పక్కా అని డుదలైన గ్లింప్స్‌ స్పష్టం చేస్తోంది. 

► ‘సైంధవ్‌’ సినిమాతో వెంకటేశ్‌ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. వెంకటేశ్‌ కెరీర్‌లో ‘సైంధవ్‌’ 75వ చిత్రం కావడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. పైగా ఆయన నటిస్తున్న తొలి పాన్‌ ఇండియన్‌  సినిమా ఇదే కావడం విశేషం. ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘సైంధవ్‌’ చిత్రాన్ని ఈ డిసెంబర్‌ 22న రిలీజ్‌ చేయనున్నట్లు తొలుత మేకర్స్‌ ప్రకటించారు. అయితే ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రాన్ని అదే రోజు రిలీజ్‌ చేయనున్నట్లు ఆ చిత్రబృందం ప్రకటించడంతో సంక్రాంతి బరిలో దిగారు వెంకటేశ్‌.

► గ్యాప్‌ ఇవ్వకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు రవితేజ. ఈ దసరాకి ‘టైగర్‌ నాగేశ్వరరావు’గా వెండితెరపై కనిపించారు. సంక్రాంతికి ‘ఈగల్‌’ చిత్రంతో బరిలో దిగడానికి రెడీ అయ్యారు. రవితేజ హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. అయితే ఆ తేదీకి విడుదలవుతుందా? వాయిదా పడుతుందా అనే చర్చ వినిపిస్తోంది. కానీ చెప్పిన తేదీకి పక్కా వస్తామంటూ రిలీజ్‌ కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టారు మేకర్స్‌. రవితేజ కెరీర్‌లోనే ‘ఈగల్‌’ వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోందని, ఇందులో రవితేజ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్రయూనిట్‌ పేర్కొంది.

► ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు గుంటూరు కారం ఘాటు చూపించ డానికి ‘గుంటూరు కారం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హీరో మహేశ్‌బాబు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబు పక్కా మాస్‌ లుక్‌లో కనిపించ నున్నారని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్‌ చెబుతున్నాయి. 

► ‘ఖుషి’ వంటి హిట్‌ సినిమా తర్వాత విజయ్‌ దేవర కొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు. ‘గీత గోవిందం’ (2018) వంటి హిట్‌ మూవీ తర్వాత విజయ్‌–పరశురామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పోటీలో నిలవనుంది.

అయితే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదనే చర్చ తాజాగా ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ సంక్రాంతికి విడుదల కాకపోతే మార్చిలో రిలీజ్‌ కానుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడి షెడ్యూల్‌ పూర్తయ్యాక తర్వాతి షెడ్యూల్‌ చిత్రీకరణకు అమెరికాకు బయలుదేరనుంది యూనిట్‌. దాదాపు నెలరోజులకు పైగా అక్కడి లొకేషన్స్‌లో షూటింగ్‌ జరపనున్నారట. సంక్రాంతికి ఇంకా నెలన్నరే ఉంది. కానీ ‘ఫ్యామిలీ స్టార్‌’ షూటింగ్‌కి దాదాపు అంతే సమయం పడుతుందట. అందుకే ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తుందా? లేదా అనే చర్చ జరుగుతోంది.

► ఈ సంక్రాంతి బరిలో స్టార్‌ హీరోలు దిగుతుంటే నేనూ వస్తున్నానంటున్నాడు యువ హీరో తేజ సజ్జా. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను–మాన్‌’. ‘జాంబీ రెడ్డి’ వంటి హిట్‌ మూవీ తర్వాత తేజ సజ్జా, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఇది. అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర చేశారు. కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడి, చివరికి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్‌ కానుంది. 

డబ్బింగ్‌ కూడా.. 

పండగకి స్ట్రయిట్‌ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు కూడా వస్తుంటాయి. ఈసారి రజనీకాంత్‌ సినిమాతో పాటు జోరుగా బరిలో నిలవనున్న అనువాద చిత్రాలేవో తెలుసుకుందాం. 

 ‘జైలర్‌’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రజనీకాంత్‌ ‘లాల్‌ సలాం’తో పొంగల్‌ (సంక్రాంతి) బరిలో దిగుతున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్‌ సంతోష్‌ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో స్టార్‌ క్రికెటర్‌ కపిల్‌ దేవ్, జీవితా రాజశేఖర్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

ధనుష్, ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జి.శరవణన్, సాయి సిద్ధార్థ్‌ నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

శివ కార్తికేయన్‌ హీరోగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అయలాన్‌’. ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ఆర్‌డీ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజవుతోంది.

తమన్నా, రాశీ ఖన్నా లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘అరణ్మనై 4’. స్వీయ దర్శకత్వంలో ‘అరణ్మనై’ ఫ్రాంచైజీలో భాగంగా సుందర్‌ .సి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పొంగల్‌కి రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు