జగ్గారెడ్డి.. చంద్రబాబు ఏజెంట్

7 Sep, 2014 23:35 IST|Sakshi

సిద్దిపేట టౌన్: మెదక్ ఉప ఎన్నికల్లో  పోటీ చేస్తున్న జగ్గారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏజెంట్, బీజేపీ మైనార్టీల వ్యతిరేకమని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ ధ్వజమెత్తారు. సిద్దిపేట శివమ్స్ గార్డెన్‌లో ఆదివారం నియోజకవర్గ మైనార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మహమూద్ మాట్లాడుతూ, దశాబ్దాల నుంచీ తెలంగాణలో ముస్లింలు అణచివేతకు గురయ్యారన్నారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి కాంగ్రెస్ పాలకులకు చెంచాగిరి చేసిన పైరవీకారుడన్నారు.

 సిద్దిపేట నీళ్లు తాగితే గుండెల్లో ఉద్యమ స్ఫూర్తి రగులుతుందన్నారు. ఇందుకు కేసీఆర్, హరీష్‌రావులే నిదర్శనమన్నారు. ఇప్పుడు తెలంగాణలో మైనార్టీలు తలెత్తుకుని తిరిగే ఆత్మవిశ్వాసాన్ని అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ పథకాల పట్ల ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. బంగారు తెలంగాణలో మైనార్టీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీ సంక్షేమ పథకాలు దళారులకు ఎక్కువగా చెందాయని,  తమ ప్రభుత్వ ఫలాలు మాత్రం నేరుగా ప్రజలకు చేరుతాయన్నారు.

 ముస్లింలంటే నవాబులు కాదు: మంత్రి ఈటెల
 ముస్లింలంటే నవాబులు మాత్రమే కాదని, ఇరానీ హోటళ్లలో టేబుళ్లు తుడిచేవారు, పంక్చర్ దుకాణాల్లో పనిచేసేవారు, పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు పోయేవారు కూడా ముస్లింలలో ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అట్టడుగున ఉన్న ముస్లింలను ఉన్నత స్థాయికి తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

 ఎంత మెజార్టీ వస్తే అంత బలం: మంత్రి హరీష్
 మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎంత మెజార్టీ వస్తే ప్రభుత్వానికి, పేద ప్రజల సంక్షేమ పథకాలకు అంత బలం చేకూరుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మైనార్టీలంతా టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపి కేసీఆర్‌ను మరింత శక్తివంతున్ని చేయాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో పడ్డట్టే, బీజేపీకి ఓటేస్తే చంద్రబాబుకు మద్దతు పలికినట్లేనన్నారు. దేశంలో కేసీఆర్ పాలన మోడల్‌గా మారుతుందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంక్‌గా వాడుకున్నాయని ఆరోపించారు.

 సమావేశంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మైనార్టీ నేతలు ఖాదర్, మిస్కిన్, గౌస్‌మొహినొద్దీన్, అసీఫ్, వాజీద్, సర్వర్, షమీ, అలీం, ఆరీఫ్, సుల్తాన్, అబ్దుల్ రజాక్, తంజుముల్ ముసాజిత్ సంఘ్ సార థి ఎజాజ్ హఫీజ్, కరీంనగర్ టీఆర్‌ఎస్ నేతలు ముజాఫరొద్దీన్, అఫ్జల్, అక్బర్, టీఆర్‌ఎస్ మహిళ నాయకురాలు షకీరా మాట్లాడారు. టీఆర్‌ఎస్ నేతలు నరేంద్రనాథ్, రాజనర్సు పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega