మరొకరు ఎవరో..

4 Jun, 2014 08:31 IST|Sakshi
మరొకరు ఎవరో..

మంత్రి పదవిపై సీనియర్ల ఆశలు
- జిల్లాకు మరో మంత్రి పదవి వచ్చే అవకాశం
- చందూలాల్, చారి, సురేఖ మధ్య పోటీ
- ఆనవాయితీగా విప్ పదవి?

సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా జిల్లా నుంచి మరొకరికి అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. రెండో దశ మంత్రివర్గ విస్తరణపై ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్, భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఎంతో ఆశతో ఉన్నారు. సోమవారం ఏర్పాటైన మంత్రివర్గంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది.

ఉప ముఖ్యమంత్రి పదవి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు రావడం ఇదే మొదటిసారి. కీలకమైన పదవి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాకు మరో మంత్రి పదవి ఉంటుందా... ఒక్కటితోనే సరిపెట్టి చీఫ్ విప్ లేదా విప్ పదవి ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్, భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి పేర్లను స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి స్పీకర్ పదవి వచ్చినా జిల్లాకు మరో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండదు.

స్పీకర్ పదవిని జిల్లాకు ఇస్తే... ఉప ముఖ్యమంత్రితోపాటు హోదా పరంగా కీలకమైన రెండు పదవులు వచ్చినట్లు అవుతుంది. ఇదే జరిగితే జిల్లాకు మరో మంత్రి పదవి, చీఫ్ విప్, విప్ వంటివి ఏవీ వచ్చే అవకాశం ఉండదు. స్పీకర్ పదవికి పరిశీలనలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ పదవిపై విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు స్పీకర్ పదవి ఇస్తే... మన జిల్లాకు మరో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ ఉద్యమంలో మన జిల్లా ఎప్పుడూ కీలకంగానే ఉంది. టీఆర్‌ఎస్‌కు సంబంధించి అన్ని ఎన్నికల్లోనూ మంచి ఫలితాలనే అందించింది. ఉద్యమ విషయంలో కేసీఆర్ ఇచ్చిన కార్యక్రమాల్లో జిల్లాలో విజయవంతమయ్యాయి. ఇవన్నింటితోపాటు టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న వారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మినహా 17 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 11 మంది మంత్రులుగా చేరారు.

బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది. సిరికొండ మధుసూదనాచారి, కొండా సురేఖ, దాస్యం వినయభాస్కర్ బీసీ వర్గం వారే కావడంతో మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 11 మంత్రుల్లో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. ఎస్టీ వర్గానికి చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో చందూలాల్ సీనియర్‌గా ఉన్నారు. మహిళా కోటా విషయంలో కొండా సురేఖ సీనియర్‌గా ఉన్నారు.

జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వకుంటే చీఫ్ విప్ లేదా విప్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. చీఫ్ విప్ అయితే మధుసూదనచారికి, విప్ అయితే వినయభాస్కర్‌కు చాన్స్ దొరికే పరిస్థితి ఉండనుంది. మొదటి విడతలో జిల్లాలో రాజయ్య ఒక్కరికే మంత్రివర్గంలో చోటు దక్కడంతో... సీనియర్ ఎమ్మెల్యేలు రెండో దశపై ఆశగా ఉన్నారు. ఈ నెలాఖరులోపే ఇది పూర్తవుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు