పెద్దపల్లి: తికమకలేదు.. టీఆర్‌ఎస్‌దే అధికారం

1 Dec, 2018 08:57 IST|Sakshi

‘కాళేశ్వరం’తో పచ్చతోరణమే 

పోడు భూములకు హక్కులు 

చివరి ఆయకట్టుకు నీళ్లిస్తాం 

మీకు జిల్లా ఇచ్చిన  

పెద్దపల్లిలో దాసరిని గెలిపించండి  

మంథనిలో పుట్ట మధు గెలుపు ఖాయం  

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 

‘మీకు పెద్దపల్లి జిల్లా ఇచ్చిన...అందుకు కృతజ్ఞతగా దాసరి మనోహర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి కానుక ఇవ్వండి. దాసరి మనోహర్‌రెడ్డి గురించి చెప్పే అవసరం లేదు. ప్రజలందరికీ తెలుసు. అతను ఎంతో మంచి వ్యక్తి. ఇతరుల సొమ్ము ఆశించే వాడు కాదు. మంచివాళ్లను గెలిపిస్తే మంచిగుంటది. హరితహారంలో ఆయన జేబు నుంచి డబ్బులు పెట్టి, లక్షలాది మొక్కలు పంపిణీ చేసిండు.
– పెద్దపల్లి సభలో గులాబీ దళపతి కేసీఆర్‌ 

‘‘మంథనిలో పుట్ట మధు గాలి వీస్తోంది. గతంలో పాలించిన వారి కంటే మంచిగ పనిచేస్తున్నడు. అన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. లేటెస్ట్‌ సర్వేలో మధు 50 వేల మెజార్టీతో గెలుస్తున్నట్లు వచ్చింది. మంథని ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారు. వివేకంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.ఎన్ని లారీల మందుగుండు సామగ్రి తెచ్చినా.. 
మధు విజయం ఆపలేరు.’’  

– మంథని సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ 

సాక్షి, పెద్దపల్లి/మంథని:  గులాబీ దళపతి.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో ప్రజాఆశీర్వాద సభల్లో మాట్లాడారు. తికమకలేదని.. రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఏర్పడనుందని అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల  మైదానంలో నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ ‘మీకు పెద్దపల్లి జిల్లా ఇచ్చిన...అందుకు కృతజ్ఞతగా నాకు దాసరి మనోహర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి కానుక ఇవ్వండి’...అంటూ టీఆర్‌ఎస్‌ అధినేత ప్రజలను కోరారు. పెద్దపల్లికి సంబంధించి ముఖ్యమైన సమస్య ఆయకట్టుకు సరిగా నీళ్లేనని అన్నారు. ఉద్యమ సమయంలో తాను వచ్చినప్పుడు కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో నీళ్లు పోలేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. పుష్కలమైన నీళ్లు వస్తున్నాయని, చివరి ఆయకట్టుకు నీళ్లీస్తామన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కిరికిరి రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాలువ చివరిభూములు,  మొదటి భూములు అనే మాటే లేదన్నారు. కాలువ మొదటి, చివరి భూములు అంటే చంపేస్తానని ఇంజనీరింగ్‌ అధికారులకు చెప్పానన్నారు. 

మొదట ఎంత పారుతుందో చివరన కూడా అంతే పారాలన్నారు. వచ్చే టర్మ్‌లో తాను స్వయంగా పెద్దపల్లికి వచ్చి సమీక్ష చేపట్టి, ప్రతీ ఎకరాకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. హుస్సేనిమియా, మానేరు చెక్‌డ్యాంలన్నీ పూర్తి చేస్తామన్నారు. గోదావరి పక్కనే పెద్దపల్లి ఉందని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కూడా ఇక్కడి నుంచే పోతుందని, నీళ్లకు సమస్యే రాదన్నారు. నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనన్నారు. పెద్దపల్లి సభలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జి.రఘువీర్‌సింగ్, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, పార్టీ నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, గోపగాని సారయ్య తదితరులు పాల్గొన్నారు. 

పోడు సమస్య పరిష్కరిస్తా
‘తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి 58 ఏళ్లు అధికారంలో ఉండి పోడు భూముల సమస్య పరిష్కారం చేయలేదని.. ఢిల్లీల.. ఇక్కడ వాళ్ల పెత్తనమే. మరి ఎవరు అడ్డం వచ్చిండ్రు. వాళ్లకు సమస్య మీద చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లో ‘పోడు సమస్య పరిష్కరించి హక్కులు కల్పిస్తా.’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మంథని ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం మొదలుకొని మంథని వరకు పోడు భూముల సమస్య కనిపించదని.. గిరిజనుల భూ సమస్య పరిష్కరించి రైతుబంధు వర్తింజజేస్తామని కేసీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ ఏదైనా పట్టుబడితే మొండి పట్టు పడుతడు. ఎవరినో పంపిచుడు కాదు.. స్వయంగా తానే మంథని చీఫ్‌ సెక్రటరీతో సహా వచ్చి ఒకటి లేదా రెండు రోజులు ఇక్కడే పుట్ట మధు ఇంట్లో ఉండి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అడవిని నరకొద్దని.. అటవీ సంపదను కాపాడుకోవాలన్నారు. గతంలో చాలా దుర్మార్గాలు జరిగాయని.. మంథని ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారని, వివేకంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రపంచం ఆశ్చర్యపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని.. స్వీచ్‌ ఆన్‌ ఐతే మంథని నిత్య కల్యాణం, పచ్చతోరణమేనన్నారు. 

గోదావరి ఎప్పుడూ కళకళలాడుతుందని.. నీటి సంపద మంథని చుట్టూ అలుముకుంటుందన్నారు. మధు రెండు లిఫ్టులు కావాలన్నాడని.. రెండు కాదు మూడు మంజూరుచేసి నియోజకవర్గంలో అటవీ భూమి పోను ఒక ఇంచు కూడా ఎండకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. మంథనిలో పుట్ట మధు గాలి వీస్తోందని.. గతంలో పాలించిన వారి కంటే మొరుగ్గా పనిచేస్తున్నాడని కితాబిచ్చారు. అన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నాయని, లేటెస్ట్‌ సర్వేలో మధు 50 వేల మెజార్టీతో గెలుస్తున్నట్లు వచ్చిందన్నారు. మంథని సభకు వచ్చిన జనం నియోజకవర్గం ప్రజళ్లా లేరని, రెండు జిల్లాల నుంచి వచ్చినట్టుగా ఉందన్నారు. ఎన్ని లారీల మందుగుండు సామగ్రి తెచ్చినా.. మధు విజయం ఆపలేరన్నారు. రాష్ట్రంలో వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని పెద్దపల్లి, మంథని బహిరంగసభలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. మంథని సభలో ప్రభుత్వ సలహాదారు వివేకానంద, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు, టీబీజీకేఎస్‌ కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు