కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను..

14 Dec, 2018 02:56 IST|Sakshi
గురువారం రాజ్‌భవన్‌లో సీఎంగా కేసీఆర్‌తో ప్రమాణస్వీకారం చేయిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌

రెండోసారి సీఎంగా కేసీఆర్‌ ప్రమాణం

కేసీఆర్‌తోపాటు మహమూద్‌ అలీ కూడా..

రాజ్‌భవన్‌లో సాదాసీదాగా కార్యక్రమం

హాజరైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

‘కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాస నాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’.

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గురువారం మధ్యాహ్నం 1.25గంటలకు కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. కేసీఆర్‌తోపాటు మహమూద్‌ అలీ  మంత్రిగా ప్రమా ణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్‌ ముందుకు ఒంగి వినయపూర్వకంగా  అందరికీ నమస్కారం చేశారు. అనంతరం కేసీఆర్‌కు గవర్నర్‌ నరసింహన్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. రాజ్‌భవన్‌లో సాదాసీదాగా ఈ కార్యక్రమం జరిగింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్‌ అలీల నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి  ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిజామాబాద్‌ ఎంపీ కవిత దంపతులు, సీఎం కేసీఆర్‌ కుటుంబసభ్యులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ ఎమ్మె ల్యే రాజాసింగ్, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధా కర్‌రెడ్డి హాజరయ్యారు.

కొత్తగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్‌ అధికారులు, ఐపీఎస్‌ అధికారులు, వివిధ కార్పొరేషన్‌ చైర్మ న్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారాని కి ముందు గవర్నర్‌ కార్యాలయంలో ఒవైసీ తో కలిసి కేసీఆర్‌ కాసేపు కూర్చున్నారు. ముహూర్త సమయానికి సీఎంతో కలిసే ఒవైసీ బయటికొచ్చారు. వీరు మినహా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  హాజరుకాలేదు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, టీజేఎస్‌ అధ్య క్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేనితోపాటు ఆయా పార్టీల నేతలకు ఆహ్వానం రాలేదని సమాచారం.

 
రాజన్న ఆశీర్వాదం 
సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం గవర్నర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ను రాజ్‌భవన్‌లోనే ఆశీర్వదించారు. వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్‌ రమేశ్‌బాబు, ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ కేసీఆర్‌ను సత్కరించారు. అనంతరం ప్రగతిభవన్‌ చేరుకున్న సీఎంను భద్రాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. పలువురు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తదిత రులు కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌ గారికి శుభాకాంక్షలు. ఆయన మరింత ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని ట్వీట్‌ చేశారు. 

ఇదీ ప్రస్థానం
పేరు: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) 
పుట్టిన తేదీ: 17.2.1954 
తల్లిదండ్రులు: వెంకటమ్మ, రాఘవరావు 
స్వగ్రామం: సిద్ధిపేట జిల్లా చింతమడక 
విద్యార్హత: ఎంఏ 
కుటుంబం: భార్య శోభ, కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత. 
రాజకీయ జీవితం: 
యువజన కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. రాఘవాపూర్‌ సింగిల్‌ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1983లో తెదేపాలో చేరి సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో సిద్దిపేట నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 ఎన్టీఆర్‌ కేబినేట్‌లో కరు వు మంత్రిగా పని చేశారు. 1996–1999 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా మంత్రిగా పనిచేశారు. 1999–2001 వరకు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు.

2001లో ఎమ్మెల్యే పదవి, డిప్యూటీ స్పీకర్‌ పదవికి, టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2001 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచారు. 2004లో సిద్దిపేట శాసనసభ, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి విజయం సాధిం చారు.యూపీఏ ప్రభుత్వంలో కార్మికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006లో కేంద్రమంత్రి పదవికి, కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలలో విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా మరోసారి గెలిచారు.

2009లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా గెలిచారు. 2009 నవంబర్‌ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు ప్రయత్నించి అరెస్టయ్యారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేశా రు. 2014 ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ, గజ్వేల్‌ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజైన 2014 జూన్‌ 2న తొలి సీఎంగా ప్రమాణం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు.  

మరిన్ని వార్తలు