సీట్ల సర్థుబాటు సరిగా జరగలేదు: కోదండరాం

20 Nov, 2018 18:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కి 8 సీట్లు ఇస్తామన్నారని, కానీ 6 సీట్లు మాత్రమే ఇచ్చారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మిర్యాలగూడ, వరంగల్ ఈస్ట్, మహబూబ్ నగర్ కావాలని తాము అడిగామని తెలిపారు. తమ అభ్యర్థులు ఉన్న చోట..‌ కాంగ్రెస్ అభ్యర్థులను ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నామన్నారు. సరైన పద్దతుల్లో సీట్ల సర్థుబాటు జరగలేదని తెలిపారు. ముస్లింలకు ఒక్క సీటు అయినా ఇవ్వాలనుకున్నామని, కానీ గందరగోళం మధ్య ముస్లింలకు సీటు కేటాయించలేకపోయామని కోదండరాం చెప్పారు. తమకిచ్చే సీట్లకు అదనంగా ఒక్క సీటును ఓల్డ్ సిటీలో అదనంగా కోరామన్నారు. 

అందర్నీ ఒప్పించే పరిస్థితి ఉంటేనే.. జనగామ సీటు ఇవ్వమన్నానని కోదండరాం తెలిపారు. మహాకూటమికి నష్టం లేకపోతేనే తాను జనగామ నుంచి పోటీ చేయాలనుకున్నానని పేర్కొన్నారు. బీసీల కోసం తాము జనగామ స్థానాన్ని వదులుకున్నామన్నారు. కానీ.. తాము కోరుకున్న మిర్యాలగూడలో బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యను పెట్టారని తెలిపారు. ఆర్. కృష్ణయ్యను పోటీలో పెడ్తారని తమకు తెలియదన్నారు. మహాకూటమీ 'కామన్ మినిమమ్ ప్రోగ్రామ్'ను త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. కూటమి వల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం ఉందని అర్థమైందని, పెద్దన్న పాత్రను కాంగ్రెస్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మేడ్చచ్‌లో‌ జరగనున్న సోనియా గాంధీ సభలో పాల్గొంటామన్నారు. స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడు మాట్లాడలేనన్నారు. తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తి సహజంగానే ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు