పోలీస్‌ శాఖలో చివరి బదిలీలు

14 Oct, 2018 01:10 IST|Sakshi

     ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో కసరత్తు 

     జిల్లాల్లో కానిస్టేబుళ్ల నుంచి ఎస్‌ఐ వరకు.. 

     రాష్ట్ర స్థాయిలో పలువురి డీఎస్పీలకు స్థానచలనం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పోలీస్‌ శాఖలో బదిలీలను ఈ నెల 17లోపు పూర్తిచేయాలని కమిషన్‌ తేల్చిచెప్పింది. దీంతో ఇప్పటివరకు జరిగిన బదిలీలు, ఇంకా జిల్లాల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం చేయాల్సిన జాబితాపై పోలీస్‌ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకే జిల్లాలో మూడు నుంచి నాలుగేళ్ల పాటు పనిచేసిన అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా పలు దఫాలుగా ఐపీఎస్‌ అధికారులు, నాన్‌కేడర్‌ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలను పోలీస్‌శాఖ బదిలీ చేసింది.

అదే విధంగా జోన్లలో పనిచేస్తున్న సీఐ, కమిషనరేట్లలో పనిచేస్తున్న ఎస్సైలు సైతం 80 శాతం మేర మార్పు చేసింది. ఇకపోతే ప్రతీ జిల్లాలో కానిస్టేబుళ్లు, ఎస్సైల విషయంలో ఎస్పీలు కొన్ని బదిలీలు చేశారు. ఇంకా చేయాల్సి ఉండటంతో ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఆ మేరకు జాబితా రూపొందిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంలో 90 మంది డీఎస్పీలను బదిలీ చేసిన పోలీస్‌ శాఖ ఇప్పుడు మరో 15 నుంచి 20 మందిని బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఆరోపణలు రావొద్దనే..
జిల్లాల్లో 70 శాతం మేర కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు,ఎస్సైలను బదిలీ చేయగా, మిగిలిన 30 శాతం అధికారులు, సిబ్బందిని కూడా మార్చితే ఆరోపణలకు తావివ్వకుండా ఉంటుందని పోలీస్‌శాఖ భావిస్తోంది. కానిస్టేబుళ్ల బదిలీలను కూడా పూర్తి స్థాయిలో చేయాలని, ఇందుకు ఎస్పీలు, కమిషనర్లు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయం సర్క్యులర్‌ జారీచేసినట్లు తెలిసింది.   

>
మరిన్ని వార్తలు