కృష్ణా జలాల వివాదం.. కీలక సమావేశం వాయిదా

5 Dec, 2023 14:31 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 6న నిర్వహించనున్న నిర్వహించనున్న కీలక సమావేశాన్ని కేంద్ర జల్‌శక్తి వాయిదా వేసింది. మిచౌంగ్‌ తీవ్ర తుపాను కారణంగానే ఈ భేటీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్‌లతో పాటు కృష్ణా నదీయాజమాన్యం బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో ఈ సమావేశం ఉంటుందని తొలుత ప్రకటించింది.

అయితే తెలుగు రాష్ట్రాలను మిచౌంగ్‌ తుపాను కుదిపేస్తుండడంతో అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో తలమునకలైంది. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహించడం సబబు కాదని భావించిన కేంద్ర జల్‌శక్తి వాయిదా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీన సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి.. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని.. అప్పటి వరకు పూర్తిగా సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ ఇదివరకే తెలుగు రాష్ట్రాలకు సూచించారు.  కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. 

>
మరిన్ని వార్తలు