ట్రీట్‌మెంట్‌ విత్‌ చాటింగ్‌!

6 Apr, 2020 09:48 IST|Sakshi

లాక్‌డౌన్‌ వేళ నగరంలోనయా ట్రెండ్‌..

మారిన ఆస్పత్రులు, వైద్యుల పంథా

స్వల్పకాలిక అనారోగ్య సమస్యలపై నేరుగా రోగులతో చాటింగ్‌

వాట్సాప్‌ ద్వారా వివరాలు తెలుసుకుని మందులు సూచిస్తున్న వైద్యులు

టెలీమెడిసిన్‌ సేవలు సైతం..

సాక్షి, సిటీబ్యూరో: ‘హలో డాక్టర్‌..గత రెండు రోజులుగా నేను..జలుబు తలనొప్పితో బాధపడుతున్నాను. సరైన మందులు సూచించగలరు...ఓ పేషెంట్‌ వాట్సప్‌టెక్టస్‌ సందేశం...’‘ఓకే...మీరు రెండురోజుల పాటు ఫలానా యాంటీ బయాటిక్స్‌ మెడిసిన్స్‌ వాడండి...అప్పటికీ తగ్గకుంటే..మా క్లినిక్‌కు రండి..డాక్టర్‌ రిప్లై..’ 

ఏంటీ చాటింగ్‌ అనుకుంటున్నారా...? లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలో ఇటీవలి కాలంలో చాటింగ్‌ ట్రీట్‌మెంట్‌ క్రమంగా పెరుగుతోంది. తలనొప్పి..కడుపునొప్పి..మైగ్రేన్‌...ఒంటినొప్పులు..వైరల్‌ ఫీవర్‌..జలుబు తదితర స్వల్పకాలిక అనారోగ్యాలకు మాత్రమే ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అందుతోంది. ప్రస్తుతం మెజార్టీ సిటీజన్లు ఇళ్లకే పరిమితం కావడంతో ఈ ట్రెండ్‌ పెరిగింది. ఇందుకోసం నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు సైతం ఫోన్‌కాల్, వాట్సప్, టెలీమెడిసిన్‌ సేవలు అందించేందుకు ముందుకురావడం విశేషం. అయితే ఇలాంటి వైద్యం నాణ్యతపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్‌ సహా ఇతర మందుల డోసు ఎక్కువైతే ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని మూటగట్టుకోక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చాటింగ్‌ ట్రీట్‌మెంట్‌ ఇలా...
నగర వాసులకు వైద్యసేవలందించేందుకు పలు ఆస్పత్రులు, వైద్యులు, పలువురు ఫిజీషియన్లు, ఇతర స్పెషలిస్ట్‌ వైద్యులతో ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఐటీ కంపెనీలు సైతం వర్క్‌ఫ్రం హోంకు అనుమతివ్వడంతో ఆయా వైద్యుల నెంబర్లను తమ ఉద్యోగులకు అందజేసి...వారి శారీరక, అనారోగ్య సమస్యలను నేరుగా ఆయా వైద్యులతో చాటింగ్‌ రూపంలో తెలియజేసే అవకాశం కల్పిస్తున్నారు. నిర్ణీత సమయంలో నిర్ణీత డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇలా చాటింగ్‌ ట్రీట్మెంట్‌ అందజేసే వైద్యులకు నెలవారీగా వారి సేవలను బట్టి కంపెనీలు పారితోషికం అందిస్తుండడం విశేషం. పనివేళల్లో స్వల్ప అనారోగ్యానికి గురయ్యే ఉద్యోగి ఆస్పత్రికి వెళ్లి తన పేరు నమోదుచేసుకొని గంటల తరబడి  నిరీక్షించి వైద్యున్ని సంప్రదించే సమయం చిక్కనందున ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

ఇక దీర్ఘకాలిక అనారోగ్యాలు, జీవనశైలి వ్యాధులున్నవారు మాత్రం నేరుగా స్పెషాల్టీ వైద్య సేవల కోసం ఆయా ఆస్పత్రులకు వెళుతున్నట్లు స్పష్టంచేస్తున్నారు. పనిఒత్తిడి అధికమైతే మానసిక వైద్యులను చాటింగ్‌ ద్వారా సంప్రదించి వత్తిడిని తగ్గించుకునేందుకు అవసరమైన సలహాలు..సూచనలు సైతం తమ ఉద్యోగులు పొందుతున్నట్లు వెల్స్‌ఫార్గో ఐటీ సంస్థ హెచ్‌ఆర్‌ విభాగం ప్రతినిధి సత్యలింగం ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగా ఉంటేనే వారి పనిసామర్థ్యం మెరుగుపడుతుందని..కంపెనీ విధించిన టార్గెట్‌లను ఉద్యోగులు సులభంగా పూర్తిచేసే వీలుంటుందని చెబుతున్నారు. అయితే మరికొన్ని కంపెనీలు విదేశాల్లో ఉన్న వైద్య నిపుణుల సలహాలు, సూచనలను తమ ఉద్యోగులు పొందేందుకు టెలీమెడిసిన్‌ సేవలను సైతం వినియోగిస్తుండడం గ్రేటర్‌లో నయా ట్రెండ్‌గా మారింది. కాగా కొందరు ఉద్యోగులకు నేరుగా మెడిసిన్స్‌ సూచించడం వీలుకానప్పుడు సంబంధిత రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చాటింగ్‌ ద్వారా సూచిస్తున్నారు. ఆయా రిపోర్టులను సైతం వాట్సప్‌లో వైద్యులకు  పంపించిన తరవాత నిర్ణీత మోతాదులో మెడిసిన్స్‌ సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు