5,88,989 ఉల్లంఘనలు

23 Apr, 2020 09:06 IST|Sakshi
చార్మినార్‌ పీఎస్‌లో సీజ్‌ చేసిన వాహనాలు

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పక్కాగా లాక్‌డౌన్‌ అమలు

గత నెల 23 నుంచి ఇప్పటివరకు 15,605 వాహనాలు సీజ్‌

రెండు రోజులుగా 3 కిలోమీటర్ల నిబంధన కఠినతరం  

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా లాక్‌డౌన్‌ ట్రాఫిక్‌ ఉల్లంఘనుల ముందు ఏమీ పనిచేయడం లేదు. గత నెల 23 నుంచి ఇప్పటివరకు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన 5,88,989 ఉల్లంఘన గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. 15,605 వాహనాలను ఇరు కమిషనరేట్ల పోలీసులు సీజ్‌ చేశారు. సైబరాబాద్‌లో 5,05,439 ట్రాఫిక్‌ కేసులు నమోదు కాగా.. 10,694 వాహనాలను సీజ్‌ చేశారు. రాచకొండలో 83,550 ట్రాఫిక్‌ కేసులు నమోదైతే 4,911 వాహనాలు సీజ్‌ అయ్యాయి. ఆయా కమిషనరేట్లలో జారీ చేసిన ఈ చలాన్‌లలో ఎక్కువగా వాహన చోదకుడితో పాటు పిలియన్‌ రైడర్‌కు హెల్మెట్లు లేకపోవడం, ట్రిపుల్‌ రైడింగ్, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లు ఎక్కువగా ఉన్నాయని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా పోలీసులే నేరుగా వాహనాలు ఆపి వివిధ ట్రాఫిక్‌ ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు. 

3 కి.మీ దాటితే..
మొన్నటివరకు మూడు కిలోమీటర్ల పరిధిని చూసీ చూడనట్టు వ్యవహరించిన పోలీసులు రెండు రోజులుగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయా చోదకుల ఆధార్‌కార్డు చిరునామా ఆధారంగా వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. సరైన కారణం ఉంటే తప్ప పోలీసులు వదలడంలేదు. సీజ్‌ చేసిన వాహనాలను సమీప ఠాణాలకు తరలిస్తున్నారు. లేదంటే సమీప ప్రాంతాల్లోని సినిమా థియేటర్ల ఆవరణలో పార్కింగ్‌ చేస్తున్నారు. బుధవారం రోడ్డెక్కిన ప్రతి వాహనదారుడిని ఆయా చెక్‌పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలను సీజ్‌ చేశారు.  

కఠినంగా లాక్‌డౌన్‌ అమలు..  
ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించి వాహనాలపై ప్రయాణిస్తుండడంతో కరోనా వ్యాప్తికి కారకులవుతారు. ఓవైపు భౌతిక దూరం పాటించాలంటూ ఎంతగా చెబుతున్నా కొంతమంది పాటించడంలేదు. లాక్‌డౌన్‌ను వచ్చే నెల మే 7 వరకు పొడిగించడంతో ఈసారి సమర్థంగా అమలుచేస్తున్నాం. లాక్‌డౌన్‌ ముగిశాక సంబంధిత వాహనదారులు కోర్టుకు హాజరు కావాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చు. అందుకని ఎవరూ రోడ్లపైకి రావద్దు.      – వీసీ సజ్జనార్,సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

మరిన్ని వార్తలు