సర్కారీ స్కూళ్లలో అత్తెసరు చదువులు!

7 Sep, 2015 00:28 IST|Sakshi
సర్కారీ స్కూళ్లలో అత్తెసరు చదువులు!

942 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ సర్వే
3వ, 8వ తరగతుల విద్యార్థుల అభ్యాసనపై అధ్యయనం
8లో 90% మించి మార్కులు పొందింది 0.02 శాతం మందే
54.88 శాతం మందికి
40% కంటే తక్కువ మార్కులు
గణితం, ఇంగ్లిషు, సైన్స్ సబ్జెక్టుల్లో సామర్థ్యాలు అంతంతే

 
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడంలో ఉపాధ్యాయులు విఫలమవుతున్నారు. విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యే ప్రమాదముందని విద్యాశాఖ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర మానవ వనరులశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యాశాఖ ఇటీవల రాష్ట్రస్థాయి సామర్థ్యాల సాధన సర్వే (స్లాష్) చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 3, 8 తరగ తుల్లో విద్యార్థుల అభ్యాసన, మార్కుల పరిస్థితిపై సర్వే నిర్వహించింది. 624 ప్రాథమిక పాఠశాలలు, 219 ప్రాథమికోన్నత పాఠశాలలు, 99 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తంగా 942 స్కూళ్లలోని 3,144 మంది టీచర్లు, 14,806 విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి సర్వే నివేదికను రూపొందించింది.

సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు..
3వ తరగతిలో విద్యార్థులు ఇంగ్లిషును చదవలేకపోతున్నారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. తెలుగు సబ్జెక్టులో బాగా చదివే విద్యార్థులు వరంగల్ జిల్లాలో అత్యధికం మంది ఉండగా రంగారెడ్డి జిల్లాలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇతర జిల్లాల్లోని విద్యార్థులతో పోలిస్తే రంగారెడ్డి జిల్లాలో చదివే విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారు. మొత్తంగా పరిశీలిస్తే 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 2.65 శాతమే ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది. 35.39 శాతం మంది విద్యార్థులకు 40 శాతానికి మించి మార్కులు రావట్లేదు. 50 శాతం మార్కులు వస్తున్న విద్యార్థులు 49.13 శాతం ఉన్నారు. 8వ తరగతిలో తెలుగులో అత్యధిక మార్కులు సాధించినవారు నల్లగొండలో ఉండగా తక్కువ మార్కులు వచ్చిన వారు ఆదిలాబాద్‌లో ఉన్నారు. గణితంలో హైదరాబాద్‌లో చదివే విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించగా, రంగారెడ్డిలో అన్ని జిల్లాల కంటే తక్కువ మార్కులు వచ్చాయి. సైన్స్‌లోనూ అంతే. ఇక 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు కేవలం 0.02 శాతమే ఉన్నారు. 40 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు 54.88 శాతం ఉన్నారు.

 ఏటా వేల కోట్లు వెచ్చిస్తున్నా...
 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన, ఇతర విద్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధ్యాయుల వేతనాల కింద సర్కారు ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. సుశిక్షితులైన 1.40 లక్షల మంది టీచర్లున్నా 30 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనను అందించలేకపోతున్నారు. అదే ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న 30 లక్షల మంది విద్యార్థులకు 80-90 వేల మంది టీచర్లు అరకొర వేతనాలతో పనిచేస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. అనేక మంది ఉపాధ్యాయుల్లో చిత్తశుద్ధి కొరవడటం, విద్యా బోధన కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ లేకపోవడం, విద్యార్థులకు చదువు రాకపోతే సంబంధిత టీచర్లను బాధ్యులను చేసే కార్యాచరణ లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన రోజురోజుకూ దెబ్బతింటోంది.
 

మరిన్ని వార్తలు