నాగ్‌పూర్‌ ‘దారి’లో..

20 Nov, 2019 08:05 IST|Sakshi

నగరంలో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్లు 

అక్కడి మెట్రోరైలు ప్రాజెక్టును పరిశీలించిన సిటీ బృందం  

నానల్‌నగర్‌–మాసబ్‌ట్యాంక్, బీహెచ్‌ఈఎల్‌–ఆల్విన్‌ మార్గాల్లో

నిర్మాణానికి అవకాశమని ఇంజినీర్ల అభిప్రాయం  

నేడు పుణె సందర్శన

సాక్షి, హైదరాబాద్‌: ఒకే పిల్లర్‌పై ఒక వరుసలో ఫ్లైఓవర్, మరో వరుసలో మెట్రోరైలు, దిగువన రహదారిపై వాహనాలు.. ఇలాంటి దృశ్యం భవిష్యత్తులో నగరంలోనూ ఆవిష్కృతం కానుంది. మలిదశలో మెట్రోరైలు మార్గాలొచ్చే ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ నేతృత్వంలోని  ఉన్నతాధికారుల బృందం నాగ్‌పూర్‌లోని డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్ల పనులను మంగళవారం పరిశీలించింది. సిటీలో ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నా ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మెట్రోరైలు మార్గం వల్ల ఫ్లైఓవర్ల నిర్మాణం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో అవకాశామున్న ప్రాంతాల్లో డబుల్‌ డెక్కర్‌ మార్గాలు నిర్మిస్తే ఒకే పిల్లర్‌పై రెండు వరుసల్లో మార్గాలు ఏర్పడనున్నాయి.

ఒక వరుసలో మెట్రోరైలు, మరో వరుసలో ఇతర వాహనాలు ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. ఈ విధానంతో భూసేకరణ, నిర్మాణ వ్యయం తగ్గుతుంది. సమయం కూడా కలిసొస్తుంది. ట్రాఫిక్‌ సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది. ఇలా విస్తృత ప్రయోజనాలు ఉండడంతో నాగ్‌పూర్‌లోని డబుల్‌ డెక్కర్‌ మార్గాల పనులను సిటీ బృందం పరిశీలించింది. వివిధ నగరాల్లోని ఉత్తమ విధానాలను, మనకు పనికొచ్చే పద్ధతులను పరిశీలించాలన్న మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు అధికారులు తాజాగా నాగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ బృందంలో జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్లు శ్రీధర్, జియావుద్దీన్, ఎస్‌ఈలు వెంకటరమణ, దత్తుపంత్, కేటీఆర్‌ ఓఎస్డీ మహేందర్‌ తదితరులున్నారు.

నాగ్‌పూర్‌ మెట్రోస్టేషన్‌లో మేయర్‌ రామ్మోహన్, అర్వింద్‌కుమార్‌ తదితరులు

నాగ్‌పూర్‌లో ఇలా...  
నాగ్‌పూర్‌లో రూ.8,680 కోట్ల వ్యయంతో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్, అధికారుల బృందం ప్రాజెక్ట్‌ అమలుపై అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమైంది. దాదాపు 38.215 కిలోమీటర్ల పొడవుతో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ వినూత్నంగా ఉండడాన్ని గుర్తించారు. ఈ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్లకు భూ, ఆస్తుల సేకరణ తక్కువగా ఉండడంతో పాటు ప్రాజెక్ట్‌ వ్యయంలో దాదాపు 40శాతం తగ్గినట్లు  నాగ్‌పూర్‌ మెట్రో అధికారులు వివరించారు. మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణం, నిర్వహణ, ప్రత్యేకతలపై జీహెచ్‌ఎంసీ అధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

ప్రాజెక్ట్‌లో భాగంగా షటిల్‌ బస్‌ సర్వీసులు, బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలు, ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ట్రాక్‌లు తదితర సౌకర్యాలు కూడా ఉన్నాయి. నాగ్‌పూర్‌ మాదిరిగా పీపీపీ విధానంలో ఎస్టీపీలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని మేయర్‌ రామ్మోహన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగరంలో నానల్‌నగర్‌–మాసబ్‌ట్యాంక్, బీహెచ్‌ఈఎల్‌–ఆల్విన్‌ మార్గాల్లో డబుల్‌ డెక్కర్లకు అవకాశం ఉంటుందని ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్‌లో వర్షపునీరు రోడ్లపై నిల్వకుండా చేసిన ఏర్పాట్లు, వర్టికల్‌ గార్డెన్లు, అండర్‌పాస్‌లు తదితరమైనవి కూడా బృందం పరిశీలించింది. హైదరాబాద్‌ను సందర్శించాల్సిందిగా మేయర్‌ నాగ్‌పూర్‌ మెట్రో అధికారులను ఆహ్వానించారు. అధికారుల బృందం బుధవారం పుణెను సందర్శించనుంది.   


 

>
మరిన్ని వార్తలు