బొమ్మలపై వైద్యం!

18 Sep, 2018 07:37 IST|Sakshi

మృతదేహాల స్థానంలో సిమ్మన్‌ 3జీ బొమ్మలు

కొత్త పుంతలు తొక్కుతున్న వైద్య శిక్షణ కోర్సులు   

చూసేందుకు అది బొమ్మే కానీ.. ఛాతిపై స్టెతస్కోప్‌ పెడితే లబ్‌డబ్‌మంటుంది. మణికట్టు వద్ద నాడీపట్టి చూస్తే పల్స్‌రేటు తెలిసిపోతుంది. శరీరంపై కత్తిగాటు పడితే రక్తం బయటికిచిమ్ముతుంది. ఇంజక్షన్‌ నీడిల్‌ గుచ్చితే కలిగే ఆ నొప్పికి ఏకంగా భోరున ఏడ్వటమే కాదు.. కన్నీరూ కారుస్తుంది. ఐసీయూలో చికిత్స చేసే సమయంలో రోగి నుంచి ఎలాంటి రియాక్షన్స్‌ వస్తాయో అచ్చం అలాంటి అనుభూతులే మిగుల్చుతున్నాయి సిమ్యులేషన్‌ బొమ్మలు.తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలకు.. ప్రాక్టీసు తోడైనప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయి.ఆ ఉద్దేశంతోనే నగరంలోనే తొలిసారిగా కేర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో కేర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్స్‌ దీనిని ప్రారంభించింది. మృతదేహాల కొరతతో శిక్షణకు నోచుకోలేక పోతున్న వైద్యులకే కాదు నర్సులు, పారామెడికల్‌ స్టాఫ్‌కు సైతం ఈ సిమ్యులేషన్‌ బొమ్మలపై
శిక్షణనిస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో :కారు మెకానిక్‌ నేర్చుకోవాలంటే ఓ పాతకారుపై శిక్షణ పొందితే సరిపోతుంది. ఈ సమయంలో ఏదైనా పొరపాటు జరిగిన మరోసారి నేర్చుకునే అవకాశం ఉంది. కానీ అదే వైద్య చికిత్సల్లో ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి. సర్జరీల సమయంలో చేసే ఒంటిపై చేసే కోతలు, స్టంట్‌ల అమరికలు, కట్లు, కుట్ల విషయంలో సరైన అనుభవం లేకపోయినా.. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా రోగి ప్రాణాలకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వైద్య విద్యను బోధించేందుకు నగరంలో పలు ప్రైవేటు వైద్య కళాశాలలు, నర్సింగ్, పారామెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లు ఉన్నప్పటికీ.. ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీలు మినహా ప్రైవేటు ఇనిస్టిట్యూట్‌లలో శిక్షణకు అవసరమైన మృతదేహాలు లేకపోవడం, ప్రభుత్వపరంగా వాటికి అనుమతులు లేకపోవడంతో కనీస శిక్షణను కూడా పొందలేకపోతున్నారు. నిజానికి తరగతి గదిలో గురువు బోధించే పాఠాలు వైద్యంపై అవగాహన కల్పిస్తున్నాయే కానీ.. చికిత్సల్లో మెలకువలను, అనుభవాన్ని ఇవ్వలేక పోతున్నాయి. ఈ లోపాన్ని గుర్తించి కేర్‌ ఇనిస్టిట్యూట్‌ రెండు వేలకుపైగా సిమ్యులేషన్‌బొమ్మలను సమకూర్చుకుని వీటిపై శిక్షణ ఇస్తున్నాయి.

సర్జరీలు ఎలా చేయాలి.. విరిగిన ఎముకలకు కట్లు ఎలా కట్టాలి... గాయాలకు కుట్లు ఎలా వేయాలి.. ఇంజక్షన్‌ ఎలా వేయాలి..? వంటి అంశాలపై సిమ్యులేషన్‌ పద్ధతిలో శిక్షణనిస్తున్నారు. ప్రాక్టీస్‌ సమయంలో అచ్చం రోగిలాగే ఈ బొమ్మలు కూడా స్పందనలు తెలియజేస్తుండటం వైద్య విద్యార్థులకు మంచి అనుభూతిని మిగుల్చుతున్నాయి. సిమ్యులేషన్‌ పద్ధతిలో శిక్షణ పొందిన వారు తమ పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు మంచి ఉపాధి అవకాశాలను పొందుతుండటంతో ఈ కోర్సులకు ఇటీవల డిమాండ్‌ పెరిగిందంటున్నారు కేర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌సైన్స్‌ ప్రెసిడెంట్‌ మహేంద్రపాల. అనస్థీషియా ఇవ్వడం మొదలు ప్రసవాల వరకు ఇక్కడ శిక్షణఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.     

మరిన్ని వార్తలు