గ్రామైక్య సంఘాలను బలోపేతం చేయండి

28 Jul, 2018 01:26 IST|Sakshi

వీఓఏల రెండో రాష్ట్ర మహాసభలో మంత్రులు జూపల్లి, రామన్న

 గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యమవ్వాలని సూచన

ప్రతి వ్యక్తి ఆరు మొక్కలు పెంచేలా చూడండి: రామన్న

సకాలంలో వేతనాలివ్వాలని కోరిన వీఓఏల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: గ్రామైక్య సంఘాలను బలోపేతం చేయడంలోనూ, మహిళా చైతన్యంలోనూ వీఓఏ (విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌)లు కీలకంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. హైదరాబాద్‌ శివార్లలో శుక్రవారం వీఓఏల రెండో రాష్ట్ర మహాసభ జరిగింది.

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. హరితహారం, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాల్లో వీఓఏలు పూర్తిస్థాయిలో భాగస్వా మ్యం కావాలన్నారు. గ్రామాభివృద్ధిలోనూ, మహిళలను సంఘటితం చేయడంలోనూ వీఓఏలదే కీలక పాత్ర అన్నారు. వీఓఏలకు రూ.3 వేల వేతనం ఇచ్చి గౌరవించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నా రు. గ్రామైక్య సంఘాల ద్వారా కూడా మరో రూ.2 వేల వేతనాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు.  

హరితహారం సక్సెస్‌ చేయాలి
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారాన్ని విజయవంతం చేయడానికి వీఓఏలు కృషి చేయాలని జూపల్లి చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్థానికంగా కుటీర పరిశ్రమల ఏర్పాటు, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ను వినియోగించుకోవడం లాంటి కార్యక్రమాలను మహిళా సంఘాల ద్వారా చేపట్టేలా వీఓఏలు చైతన్యం చేయాలన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులను, పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. వీఓఏల భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయినా, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జూపల్లి హామీనిచ్చారు. అడవులు లేకపోవడం వల్లే వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి వ్యక్తి కనీసం ఆరు మొక్కలు పెంచేలా చైతన్యపరచాలని చెప్పారు.  

ఆరోగ్య బీమా కల్పించాలి: వీఓఏల సంఘం
వేతనాల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని వీఓఏల సంఘం ప్రధాన కార్యదర్శి మాధవి ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జీవిత, ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, వీఓఏల సంఘం గౌరవాధ్యక్షుడు రూప్‌సింగ్, వీఓఏల సంఘం అధ్యక్షుడు కోటేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నేతలు రాంబాబు యాదవ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు