ఒకే ఇంట్లో 202 ఓట్లు!

10 Nov, 2018 08:51 IST|Sakshi
202 ఓట్లు ఉన్న ఇల్లు ఇదే

కూకట్‌పల్లి ఓటర్‌ జాబితాలో అవకతవకలు

కూకట్‌పల్లి: ఓటర్‌ జాబితాలో తప్పులపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. అధికారులు వాటిని సరిదిద్దడంలేదు. ఇందుకు ఉదాహరణగా ఒకే ఇంట్లో 202 ఓట్లను నమోదు చేసిన ఘనత కూకట్‌పల్లి ఎన్నికల అధికారులకు దక్కింది. నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి ఇప్పటివరకు మనుషులు చేరకముందే అదే ఇంటి నెంబర్‌పై 73 ఓట్లను చేర్చారు. పిల్లర్ల నిర్మాణంలో మరో ఇంటిలో కనీసం పైకప్పు కూడా లేని ఇంటిలో 74 మంది ఓటర్లు ఉన్నారంటే ఎన్నికల అధికారుల పనితీరు ఏవిధంగా  ఉందో అర్థం చేసుకోవచ్చు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్‌ డివిజన్‌లో పోలింగ్‌ బూత్‌నెంబర్‌  282లోని ఎం.ఐ.జి.15–25–890 ఇంటిపై 202 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాలో సీరియల్‌ నెంబర్‌ 497నుంచి698 వరకు ఉన్నాయి. ఈ ఇల్లు కేవలం రెండు ఫ్లోర్‌లు మాత్రమే ఉంది. ఇందులో ఐదు పోర్షన్‌లకు మించి లేవు. ఇలాంటి ఇంటిలో 202 మంది ఓటర్లు ఉన్నారా అంటూ చూసే వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఇదే డివిజన్‌లోని 281 పోలింగ్‌బూత్‌లో 15–25–702 ఇంటినెంబర్‌పై సీరియల్‌ నెంబర్‌ 45 నుంచి 118 నెంబర్‌ వరకు ఓటర్లు ఉన్నట్లు లిస్ట్‌లో ఉంది. ఈ ఇల్లు నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం ఇందులో మనుషులే ఉండటం లేదు.

నిర్మాణ చివరి దశలో ఉన్న ఈ ఇంటిలో 73 ఓటర్లను ఎలా ఉంచారో, ఏ విధంగా తనిఖీలు చేశారో ఇట్టే తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే ఇదే బూత్‌లోని 15–25–761 ఇంటి నెంబర్‌పై 74 మంది ఓటర్లు ఉన్నారు. సీరియల్‌ నెంబర్‌ 156 నుంచి 230 వరకు లిస్ట్‌ ఈ నెంబర్‌పై ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఇల్లు లేదు. ఇప్పుడే నిర్మాణం ప్రారంభమై పిల్లర్‌ల దశలోనే ఉంది. కనీసం పైకప్పు కూడా లేని ఈ ఇంటిలో 74 మంది ఓటర్లు ఎలా ఉన్నారని ఆశ్చర్యా¯నికి గురిచేస్తోంది.  

మరిన్ని వార్తలు