కల్యాణానికి కరోనా సెగ

12 Apr, 2020 14:00 IST|Sakshi

లాక్‌డౌన్‌తో వేలాది పెళ్లిళ్లు వాయిదా

ఏప్రిల్, మే మాసాల్లో 20కి పైగా ముహూర్తాలు

ఉపాధి కోల్పోయిన  వేలాది మంది..

సాక్షి, కామారెడ్డి: కరోనా అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా సెగ ‘కల్యాణాన్నీ’ తాకింది. ఫలితంగా పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. గత నెల 22న జనతా కర్ఫ్యూ, ఆ వెంటనే దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ విధించడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఆగిపోయాయి. భౌతిక దూరం పాటించడమే కరోనా వైరస్‌కు విరు గుడని నిపుణులు తేల్చడంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. దీంతో పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు కరోనా సెగ తగిలింది. అప్పటికే నిశ్చయమైన ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు మూడు వేల పెళ్లిళ్లు ఆగిపోయినట్లు అంచనా.

ఇక వర్షాకాలంలోనే.. 
ఏప్రిల్, మే మాసాల్లో పిల్లలకు వేసవి సెలవులు ఉండడంతో చాలా మంది ఆ సమయంలో ఉన్న ముహూర్తాలను ఎంచుకుని వివాహాలు, ఇతర శుభకార్యాలకు సిద్ధమవుతారు. ఈసారి ఏప్రిల్‌ 5, 8, 9, 11, 15, 16, 17, 26, 27 తేదీలతో పాటు మే 2, 6, 7, 10, 13, 14, 16, 17, 18, 24 తేదీలలో శుభ ముహూర్తాలు ఉండడంతో వేలాది మంది శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకు న్నారు. అయితే కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. వైరస్‌ ప్రభావం తగ్గిన తరువాత తిరిగి ముహూర్తాలు చూసుకోవచ్చని చాలా మంది పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. మే 29 నుంచి జూన్‌ 7 వరకు శుక్ర మౌఢ్యం ఉండడంతో ఆ సమయంలో శుభ ముహూర్తాలు లేవు. ఆ తరువాత ఉన్నప్పటికీ వర్షాకాలం సీజన్‌ మొదలవుతుంది. (8 వేలు దాటిన కరోనా కేసులు)

ఉపాధికి ఆటంకం.. 
పెళ్లిళ్లపై ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతన్నారు. ఫంక్షన్‌ హాళ్లలో పని చేసే వారితో పాటు డెకొరేటర్స్, క్యాటరర్స్, కుక్, సర్వర్స్, మేలతాళం, బ్యాండు మేళం, ఫొటో, వీడియోగ్రాఫర్స్‌.. ఇలాంటి వారంతా కరోనా కారణంగా ఉపాధికి దూరమయ్యారు. పెళ్లి పందిళ్లు తయారు చేసేవారు, డెకరేష న్‌ చేసే వారు, వంటలవారు, మేలతాళంతో పాటు పంతుళ్లూ పనిలేక ఉండాల్సి వస్తోంది. సీజన్‌లో నా లుగు డబ్బులు సంపాదించాలని ఆశపడ్డ వారిని క రోనా దారుణంగా దెబ్బ తీసింది. మరో పదిహేను, ఇరవై రోజులు ఇలాగా ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఆందోళన చెందుతున్నారు. 

వ్యాపారాలపైనా ప్రభావం.. 
పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు వస్త్ర దుకాణాలు, బంగారు షాపులు, ఫర్నిచర్, స్టీల్‌ దుకాణాలు, లేడీస్‌ ఎంపోరియంలు... ఇలా రకరకాల వ్యాపారాలు జోరుగా సాగేవి. పెళ్లిళ్లు లేకపోవడంతో ఆయా వ్యాపారాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సీజన్‌లోనే మూతవేసి ఉంచడం మూలంగా కిరాయిలు చెల్లించడం, పని వాళ్లకు జీతాలు సమకూర్చడం భారంగా మారింది. అలాగే బంగారు ఆభరణాలు చేసే స్వర్ణకారులు, పెళ్లి తంతు నిర్వహించే బ్రాహ్మణులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా కరోనా ఎంతో మంది ఉపాధికి గండి కొట్టింది.

కళ తప్పిన ఫంక్షన్‌ హాళ్లు.. 
పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే ఫంక్షన్‌ హాళ్లు కళకళలాడేవి. పెళ్లిళ్లు, రిసెప్షన్లతో ఎప్పుడు చూసినా బిజీగా ఉండేవి. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాలతో పాటు ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్‌ పట్టణాల్లో 200లకు పైగా ఫంక్షన్‌ హాళ్లున్నాయి. అలాగే, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫంక్షన్‌ హాళ్లు ఉన్నాయి. వీటికి తోడు కుల సంఘాల భవనాలు, చిన్న చిన్న కమ్యూనిటీ హాళ్లు వేలాదిగా ఉన్నాయి. చాలా మంది నెల, రెండు నెలల ముందుగానే ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేసుకుని ఏర్పాట్లకు సిద్ధమవుతుంటారు. ఎందుకంటే సమయానికి హాల్‌ దొరకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని అందరూ ముందుగానే బుక్‌ చేసుకుంటారు.

ఏప్రిల్, మే మాసాల్లో ముహూర్తాలకు సంబంధించి చాలా ఫంక్షన్‌ హాళ్లు ఎప్పుడో బుక్‌ అయిపోయాయి. అయితే, కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. దీంతో అడ్వాన్సులు వాపస్‌ ఇవ్వాల్సి వచ్చిందని కామారెడ్డిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ నిర్వాహకుడు తెలిపాడు. తరువాత తేదీ ఖరారు చేసుకున్నాక తిరిగి అడ్వాన్సులు ఇస్తామంటూ చాలా మంది డబ్బులు రిటర్న్‌ తీసుకున్నారని చెప్పారు. మరికొందరేమో ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా.. మరో తేదీ నిశ్చయమయ్యాక చెబుతామని అడ్వాన్స్‌ అలాగే ఉంచేస్తున్నారని నిజామాబాద్‌లోని ఓ ఏసీ ఫంక్షన్‌ హాల్‌ యజమాని వివరించారు.

వాయిదాల పర్వం.. 
 కామారెడ్డి జిల్లా చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన యువకుడికి, అదే గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్‌ 5న ఎంగేజ్‌మెంట్, మే 6న పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంగేజ్‌మెంట్‌తో పాటు పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
 నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. తిరుపతికి చెందిన యువ డాక్టర్‌తో ఈ నెల 9న వివాహం జరగాల్సింది. కానీ కరోనా పుణ్యమాని పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 
► కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన యువకుడికి, సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన యువతితో ఈ నెల 15న వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు నిశ్చయించారు. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా ఆ ముహూర్తాన్ని వదులుకున్నారు. కోవిడ్‌ పీడ విరగడైన తర్వాత మరో ముహూర్తం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. 

మరిన్ని వార్తలు