ఆర్డీవో ఆఫీస్‌ ముందు కొండా నిరసన

12 Mar, 2019 14:36 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాకు అన్యాయం జరిగిందంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆర్డీవో ఆఫీస్‌ ముందు నిరసనకు దిగారు. జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని అదే విధంగా వికారాబాద్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైలును పొడిగించాలని ఆందోళనకు దిగారు. పాలమూరు- రంగారెడ్డి జలాల సాధన, వికారాబాద్‌ శాటిలైట్‌ సిటీ హామీ అమలు కోసం దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి(తాండూరు‌), వికారాబాద్‌ మాజీ మంత్రులు డాక్టర్‌ చంద్రశేఖర్‌, గడ్డం ప్రసాద్‌ కుమార్‌, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం సహా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాగా టీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో తన ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇప్పటికే జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికార పార్టీ తీరును ఎండగడుతున్నారు. జోన్‌ విషయంలో నిరుద్యోగులకు, యువతకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల కాకముందే విజయం సాధించాలని పక్కా వ్యూహంతో ఆయన ముందుకు సాగడం విశేషం.

ఇక మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారనున్నారనే వార్తల నేపథ్యంలో ఆమెను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన కుమారుడు కార్తీక్‌ రెడ్డికి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని ఆమె పట్టుపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చేవెళ్లలో పట్టు ఉన్న సబితా కుటుంబానికి కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయిస్తుందా లేదా విశ్వేశ్వర్‌ రెడ్డినే రంగంలోకి దింపుతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు